సతీదేవి గుండె భాగం ఉన్న శక్తిపీఠం విశేషాలు మీకు తెలుసా !

-

సతీదేవి ఆత్మార్పణ తర్వాత ఒక్కోభాగం ఒక్కోచోట పడింది. ఆ ప్రదేశాలు శక్తిపీఠాలుగా వెలిసాయి. అటువంటి పీఠాలలో అమ్మవారి గుండెపడిన ప్రదేశం, శక్తిపీఠం విశేషాలు తెలుసుకుందాం…

అంబాజీ, భారతదేశంలోని అతి పురాతనమైన క్షేత్రం. పురాతన తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో బనస్కాంత జిల్లాలో దంతా తాలూకాలోని గబ్బర్ కొండల పైన అంబాజీ మాత పీఠం ఉంది. దీని చుట్టూ అరావళి పర్వతాల్లోని దట్టమైన అడవులు వున్నాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికతల మేలుకలయిక పర్యాటకులను ఆనందపరుస్తుంది. గబ్బర్ కొండలు సముద్రమట్టానికి 1,600 అడుగుల ఎత్తున పురాతన ఆరావళి పర్వతాలు ఉన్నాయి. నైరుతి వైపున ఉన్న అరాసుర్ కొండలపైన వేదకాలపు సరస్వతి నది జన్మస్థానానికి దగ్గరలో గబ్బర్ కొండలు ఉన్నాయి.

ఈ నిటారు గబ్బర్ కొండలు ఎక్కడం చాల కష్టం. తీర్థయాత్రికులు కొండ పాదాల నుండి 300 రాతి మెట్లను ఎక్కి ఒక సన్నని ప్రమాదకర మార్గాన్ని చేరవలసి ఉంటుంది. ధార్మిక ప్రాముఖ్యత అంబాజీ ఆలయాన్ని భారతదేశ ప్రధాన శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం సతీదేవి దేహంలోని గుండె గబ్బర్ కొండల పైన పడింది. అరసుర్ కొండల పై ఉండటం వలన పవిత్ర “అరాసురి అంబాజీ” గా పిలిచే ఈ ఆలయంలో ఈ దేవత విగ్రహం ఉండదు. “శ్రీ విసా యంత్రాన్ని” ప్రధాన విగ్రహంగా కొలుస్తారు. ఈ యంత్రాన్ని కన్నులతో చూడరాదు. ఈ వీసా శ్రీ యంత్రాన్ని పూజించడానికి కళ్ళకు గంతలు కట్టుకోవలసి ఉంటుంది. ప్రతి ఏటా భాద్రపద పౌర్ణమి నాడు ఇక్కడ ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది, దేశం నలుమూలల నుండి ప్రజలు అంబే మాతను పూజించడానికి జూలై నెలలో ఇక్కడకు వస్తారు. దీపావళి పండుగ సందర్భంగా కూడా అంబాజీ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. మహాభారతంలో కూడా అంబాజీ ప్రస్తావన ఉంది.

పాండవులు వనవాసం చేసేటప్పుడు అంబాజీ మాతను కొలిచేవారని ఈ కథ తెలియచేస్తుంది. భౌగోళిక స్థితి గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులో కదియద్రకు 73 కిలోమీటర్ల దూరంలో, మౌంట్ అబూ నుండి 45 కిలోమీటర్లు, పాలంపూర్ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటక ఆకర్షణలు గబ్బర్ పైన సుందర దృశ్యాలనే కాక రోప్ వే ఎక్కడం ద్వారా కూడా ఆనందించ గలిగిన కైలాస్ కొండలు వంటి ప్రాంతాలు ఉన్నాయి. తీర్థయాత్రికులు తరచూ సందర్శించే మరి కొన్ని ధార్మిక ప్రాంతాలు కూడా గబ్బర్ కొండల పై ఉన్నాయి. ప్రధాన ఆలయం వెనుక మన్ సరోవర్ అనే చెరువు ఉంది. ఈ పవిత్ర చెరువు రెండు ప్రక్కల ఒకటి మహాదేవునికి, రెండవది అంబాజీ మాత సోదరి అజయ్ దేవికి చెందిన దేవాలయాలు రెండు ఉన్నాయి. వేద కాలపు స్వచ్చమైన నది సరస్వతి జన్మస్థానానికి దగ్గరలో అంబాజీ ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో పురాతన శ్రీ కోటేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఇది గౌముఖ్ వద్ద ఒక పవిత్ర జలాశయంతోను, సరస్వతి నదితోను కలిసింది. అంబాజీ, అనేక మంది భక్తులు గౌరవించే, వివిధ మతాలకు, నేపథ్యాలకు చెందిన తీర్థయాత్రికులు విచ్చేసే ప్రసిద్ధ భారత దేశ తీర్థయాత్రా కేంద్రం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news