ప్రాచీనమైన మన భారత దేశంలో సుప్రసిద్ధ ,ప్రముఖ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.. అటువంటి ఆలయాలలో ప్రసిద్ధమైన వరసిద్ది వినాయకుని ఆలయం. మన రాష్ట్రమలో చిత్తూర్ జిల్లాలో ,కాణిపాకంలో ఉంది. ఇక్కడి వినాయకుడు స్వయంభువుగా నుతిలో నుండి ఉద్భవించాడు. పూర్వ కాలంలో చెవిటి, గుడ్డి, మూగ అయిన ముగ్గురు సోదరులు ఉండేవారు. వారికి ఒక ఎకరంన్నర మాగాణి ఉండేది. దానికి నీరు ఒక నూతి లో నుండి తోడి ఆ పొలం సాగు చేసేవారు. కొన్ని రోజులకు ఆ నూతిలో నీరు ఎండి పోయింది. ఇంకా కొంచెం లోతు నుతిని తవ్వితే నీరు వస్తుందేమో అని తవ్వడం ప్రారంభించారు.
తవ్వగా, తవ్వగా పారకు ఏదో రాయి తగిలింది చూస్తే ఒక నల్లని రాయి. దాని నుండి రక్తం కారడం మొదలు పెట్టింది. ఇది ఏమిటా అని ఇంకా కొంచెం తవ్వారు. అందులో నుండి వినాయకుని విగ్రహం ఆవిర్భవించింది. చూస్తూ ఉండగానే ఆ నూతిలో రక్తం ఊరడం మొదలైంది. ఆ వినాయకుడిని పూజించిన అన్నతమ్ములకు ఉన్న లోపాలన్నీ పోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఊరి జనం అందరు వచ్చి కొబ్బరి నీటితో అభిషేకం చేసారు. ఆ అభిషేక జలం తోనే పావు ఎకరం భూమి తడిసింది. అందుకే ఈ దేవునికి కాణిపాకం వినాయకుడు అని పేరు వచ్చింది. తరువాత క్రి.శ.11వ శతాబ్దం లో చోళులు దేవాలయాన్ని నిర్మించారు. అని ఇక్కడి స్థల పురాణం.
ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ఈ వినాయకుడు రోజురోజుకి పెరుగుతాడని స్థానికులు చెపుతున్న మాట. అంతే కాదు ఈ స్వామికి ఎదురుగా వేరే నూతిలో వినాయకుని వాహనమైన ఎలుక ఉంటుంది. ఇక్కడ మనకు ఇష్టమైనది వదిలితే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. ఈ విజ్ఞ వినాయకుడు సత్యదేవునిగా ప్రసిద్ధి. ఎవరు అయినా తప్పు చేస్తే ఆ వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ నుతి నీటితో స్నానం చేయిస్తే వారు తప్పు ఒప్పుకుంటారని ప్రతీతి.అందుకే ఈ దేవుని ముందు ప్రమాణం చేయడానికి అబద్దాలు చెప్పేవారు ముందుకు రారు అని భక్తుల నమ్మకం.