శ్రావణమాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో వచ్చే శనివారాలు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్ర దినంగా భావించబడే శ్రవణ నక్షత్రం రోజున భక్తులు అత్యంత విశేషమైన రోజుగా భావిస్తారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక శాంతి లభిస్తాయని భక్తుల నమ్మకం. శ్రావణ శనివారానికి గల ప్రత్యేకత ఏంటి ? శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం యొక్క ప్రాముఖ్యత పూజా విధానం మనము తెలుసుకుందాం..
శ్రావణ శనివారం ప్రత్యేకత: ఈ సంవత్సరం ఆగస్టు 9న శ్రావణమాసంలో శ్రవణా నక్షత్రం శనివారం రావడం జరిగింది. శ్రావణమాసం శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి చంద్రుడు కలిసిన ఈరోజు ఎంతో విశేషమైనది. ఈ నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం గా భావించబడుతుంది. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన రోజుగా భావిస్తారు. ఈరోజు ఆయన పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారు. శ్రావణ శనివారం రోజు(ఆగష్టు 9) శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్ర దినంగా భక్తులు జరుపుకుంటారు. శ్రావణి శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యంగా తిరుమలలో విశేష పూజలు, అభిషేకాలు,హోమాలు నిర్వహించబడతాయి. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి దైవకటాక్షం కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు.
శ్రవణా నక్షత్రం యొక్క ప్రాముఖ్యత : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. ఆయన జన్మ నక్షత్రం శ్రవణం. ఈ మాసంలో పౌర్ణమి రోజు శ్రవణా నక్షత్రం రావడం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. శ్రీ శ్రీనివాసుని ఈరోజు ఆరాధించడం భక్తులకు సంపద ఆరోగ్యం, సౌభాగ్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు శనివారం కావడం వల్ల శని గ్రహ దోషాల నుండి విముక్తి కలగడమే కాక,శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కూడా కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
శ్రావణ శనివారం పూజా విధానం: శ్రావణమాసంలో వచ్చే శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఉదయం తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటిలోని మందిరమునందు లేదా ఏదైనా తూర్పు ముఖముగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని పీటపై ఉంచి పూజా స్థలాన్ని శుభ్రం చేసి రంగులతో, పూలతో అలంకరించాలి. ముందుగా గణపతి పూజ చేసి ఆ తరువాత వెంకటేశ్వర స్వామి పూజను గావించి, శ్రీ శ్రీనివాసని సుప్రభాతం స్తోత్రాలు, వజ్రకవచ స్తోత్రం లాంటి విశేషమైన స్తోత్రాలను పటించాలి.
స్వామి కి ఇష్టమైన నైవేద్యం :పూజ పూర్తయిన తరువాత ధూపం దీపం దేవుడికి సమర్పించి, శ్రీ వెంకటేశ్వర స్వామి కి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డు, చలివిడి వడపప్పు పానకం బెల్లం పొంగలి నివేదన చేసి మంగళ హారతి ఇవ్వవలెను. ఈ విధంగా పూజను పూర్తి చేసి సాయంత్రం 6 గంటల తరువాత, దీపారాధన చేసి స్వామివారికి పూలను సమర్పించి ,పాలు పండ్లు నవేధ్యం పెట్టి, తమ కోరికలను స్వామి వారికి విన్నవించవలెను.పూజ పూర్తి చేసిన తర్వాత ఆరోజు ఒక పూట భోజనం చేసి, దగ్గరలోని దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించవలెను. ఈ విధంగా పూజను పూర్తి చేసిన ఎంతోమంది భక్తులకు స్వామి కృప కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
(గమనిక : పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే )