డిసెంబర్ 26 సూర్య గ్రహ ప్రభావం వలన ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం.
అయితే ఇవి రాష్ట్రంలోని పలువురు జ్యోతిషులు చెప్పిన ఫలితాలను ఆధారంగా చేసుకుని రాసినవి.
మేషరాశి
ఈ గ్రహణం వల్ల ఈరాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. అష్టమాధిపతి స్వ రాశిలో ఉండటం వలన సానుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయి. మానసిక పరమైన ఆలోచనలో మార్పు గోచరిస్తుంది. జనవరి నుండి మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెలుగులోకి తీసుకు వచ్చి కొత్త ఏడాది 2020 ప్రారంభాన్ని అభివృద్ధి ప్రయాణం ఆనందంగా గడపండి.
వృషభరాశి
ఈ రాశివారికి అష్టమ భావములలో ఏర్పడుతున్న గ్రహముల కూటమి ప్రభావం వలన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి కుజుడు తన రాశిలో ఉండటం వలన కుటుంబ సభ్యుల సహకారాన్ని అందిపుచ్చుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఆవేశాలకు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. శాంతి, ఓపిక అవసరం.
మిధునరాశి
ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. త్వరలో మీరు స్థిరమైన బంధాలను ఏర్పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంది. వచ్చే సంవత్సరంలో మీ మాట బలం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఈరాశి వారికి ఆవేశం అదుపులో పెట్టుకుని మృదువైన మాట తీరుతో కాలం గడపండి. తొందరపడి బాంధవ్యాలను తెంచుకోకండి. గ్రహపరిహారాలను చేసుకోవడం మంచిది.
కర్కాటకరాశి
మంచి జరుగుతుంది. సానుకూల దృక్పథంతో అన్ని అనుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. అదృష్ట కాలాన్ని అనవసరమైన అనుమానాలతో పాడు చేసుకోకండి. మానసికమైన ఆందోళనలు దరిచేరకుండా భక్తీ , ధ్యాన మార్గం అవలంభించండి. అనుకోని అవకాశాలు వస్తాయి. సహనం చాలా అవసరం.
సింహరాశి
ఈరాశి వారు ఉద్యోగాలు మొదలగు విషయాలలో జాగ్రత్త వహించండి. జనవరి నుండి మీకు మీ సంతానానికి తప్పకుండా లక్ష్యం సాధించడానికి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా ఇప్పుడు వచ్చే అనిశ్చితమైన పరిస్థితిని మనో ధైర్యంతో నిబ్బరంగా ఎదుర్కోవడం మీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులైనా ఓపికతో ఉంటే మీకు సానుకూలం అవుతాయి.
కన్యా రాశి
ఈరాశి వారికి అదృష్ట సమయం అని చెప్పాలి. అర్ధాష్టమ శని తొలగిపోయే రోజులు. ఈ ఒత్తిడిని తట్టుకుని అనుకూలంగా మార్చుకోగలిగితే విజయం మీదే. అవకాశాలు కలిసివస్తాయి.
తులారాశి
ఈరాశి వారికి ద్వితీయ అధిపతి కుజుడు అద్వితీయము లోనే ఉండటం వలన సుఖమైన కాలం. అభివృద్ధిదాయకం. శాంతి సౌఖ్యం. ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి .
వృశ్చికరాశి
ఈరాశివారికి రాజ్యాధిపతి కుజుడు సొంత రాశిలో ఉండటం వలన ద్వితీయ అధిపతి గురుడు ద్వితీయంలో ఉండటం వలన రాబోయే సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మంచి సమయం ఇది. అవకాశాలను, అదృష్టాన్ని అందిపుచ్చుకోండి.
ధనస్సురాశి
ఇది నిజంగా పరీక్షా కాలమే. జరుగుతున్న పరిణామాలను మనసుకు పట్టించుకోకుండా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మీరు తప్పకుండా వచ్చే సంవత్సరం నుండి ప్రశాంతంగా ఉంటారు. వీరికి అత్యంత ఒత్తిడికి , ఆందోళన ఉండే సమయం.
మకరరాశి
ఈరాశివారికి పనులలో గుర్తింపులు పొందలేరు, అత్యధిక వ్యయం. నిరాశ చెందకుండా జనవరి మాసం వరకు కాలం గడపడం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. దేవుడిని ప్రార్థించడం, ఓపిక, సహనం అత్యంత అవసరమైన సమయం.
కుంభరాశి
వీరికి అత్యంత అదృష్టం అయినా కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని గ్రహాలు కలసివచ్చే రాశులులో ఉండటం వలన అత్యంత లాభదాయకమైన కాలం.
మీనరాశి
ఈరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మంచి అవకాశం ఉంటుంది. శాంతితో ఓపకితో కాలం గడపండి. జనవరి వరకు కొన్ని విషయాలను వాయిదా వేయండి. మీ సృజనాత్మకతను, నిర్ణయాలను వచ్చే సంవత్సరం ఉపయోగించుకోండి.
నోట్- ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ప్రతి వారికి జరుగుతున్న దశ, అంతర్దశ, నక్షత్ర ప్రభావము,రాశి,లగ్నంను బట్టి ఫలితాలు నిర్ణయం అవుతాయి. మన భావాలను సానుకూల దృక్పథంతో నడిపించడానికి ఈ గోచార ఫలితాలను పరిశీలించవలసి ఉంటుంది. గోచర గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు పుట్టిన తేది ఆధారంగా వ్యక్తీ గత జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు తెలుసుకుని ఆచరించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
– కేశవ