గణపతిని పూజించిన పరమ శివుడు!!

-

గణపతి విఘ్నాధిపతి. గణేశుని పూజించకుండా ఏ పని ప్రారంభించినా విఘ్నం తప్పదు. వినాయకుడు సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. కింది ఉదాహరణ చూడండి.
సాక్షాత్తు పరమ శివుడు త్రిపురాసుర సంహారం కోసమై వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ, కఠోర తపస్సు చేసి అఘోరాస్త్రం సృష్టించాడు. రెండు వర్గాల మధ్యా అనేక సంవత్సరాల పాటు ఘోర యుద్ధం జరిగింది. అయినా శివుడు అఘోరాస్త్రం ప్రయోగించే అవకాశం రాకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఆత్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువును ప్రార్ధించాడు మహాశివుడు.

lord shiva worshipping vinayaka

శివుని ప్రార్థన ఆలకించి విష్ణుమూర్తి ప్రత్యక్షమై మందహాసం చేశాడు. క్షణమాగి, ఏ పని తలపెట్టినా విఘ్నేశ్వరుని ముందుగా పూజించి, ఆ తర్వాతే పని ప్రారంభించాలి. లేకుంటే పని విజయవంతం కాదు. నువ్వు లయకారుడివి గణపతి నీ కొడుకేనన్న భావంతో గణపతిని ప్రార్థించకుండా యుద్ధభూమిలో దిగావు. అందుకే నీకు అఘోరాస్త్రం ప్రయోగించే అవకాశమే రాలేదు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. విఘ్నేశ్వరుడు నీ పుత్రుడేనన్న సంగతి కాసేపు పక్కనపెట్టి, పరబ్రహ్మస్వరూపంగా భావించు. గణపతిని ధ్యానించు. ఆవాహనం చేయి. షోడశోపచార విధులతో పూజించు. అప్పుడే అనుకున్నది నెరవేరుతుంది. విజయం లభిస్తుంది. అంటూ హితోపదేశం చేశాడు. అంతే వెంటనే పరమ శివుడు గణపతి ఆరాధన చేసి యుద్ధంలో విజయం సాధించాడు. అదీ సంగతి. విఘ్నేశ్వరుని పూజించనిదే పని సఫలం కాదు. స్వయంగా శివుడికి కూడా తలపెట్టిన పనిలో విఘ్నం తప్పలేదు. వినాయకుడు సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version