ఎందుకు మహాలయ పక్షాలు పెట్టాలి ?

భాద్రపదమాసంలో బహుళ పక్షంలో పదిహేను రోజులు పక్షాలు అంటే శ్రాద్ధ విదులు, దానాలు ధర్మాలు చేయాలంటారు అసలు ఎందుకు ఇవన్ని. చేయకుంటే ఏమిటి అనేది చాలామంది ప్రశ్న దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం… మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి … అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి.

అలా జరగాలంటే…పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..తద్దినాలు పెడుతున్నాం కదా … మహాలయ పక్షాలు పెట్టాలా ?అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ?

వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు ఏర్పాటుచేశారు మన పూర్వీకులు.

– శ్రీ