సమస్యల పరిష్కారం కోసమే నగరబాట : మేయర్ శ్రీమతి గుండు సుధారాణి

-

  • స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి
  • గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి
  • ఆరు డివిజన్లలో కమిష‌న‌ర్‌తో క‌లిసి ప‌ర్య‌ట‌న
  • సమస్యలను వివరించిన కార్పొరేటర్లు, ప్రజలు

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌ జనవరి 04 : సమస్యల పరిష్కారం కోసమే నగర బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం నాడు మహా నగరంలోని 19 వ డివిజన్ నుంచి 24 వరకు ఆరు డివిజన్లలో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి మేయర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ల కమిటీల‌ బాధ్యులు, ప్రజలు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా 19వ డివిజన్ కాశిబుగ్గలోని రంగనాయక దేవాలయ తోరణం వద్ద నుండి కమిషనర్ ప్రావీణ్యతో కలిసి మేయర్ నగర బాట కార్యక్రమానికి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బల్దియా పరిధిలో ప్రతీ మంగళవారం ఆరు డివిజన్ లలో పర్యటించి అక్కడి స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి కార్యాచరణ సిద్ధం చేశామ‌న్నారు. క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను స్థానిక కార్పొరేటర్లు, అధికారుల సమన్వయంతో పరిష్కరించడానికి కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 19వ డివిజన్ లోని పైప్ లైన్ లీకేజీ, డామేజ్ రోడ్స్, రోడ్ సమస్యలను, సొసైటీ కాలనీ వద్ద గల 7 డివిజన్లకు సంబంధించిన స్మశాన వాటికను స్థానిక కార్పొరేటర్ ఓని స్వర్ణలత -భాస్కర్, మార్కెట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, స్థానికులు మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. మేయర్, కమిషనర్ లు పరిశీలించి అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డివిజన్ లో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలను వెంటనే అరికట్టాలని పబ్లిక్ హెల్త్ డీఈని ఆదేశించారు.


20వ డివిజన్లో బీఎన్ రావు కాలనీ కమ్యూనిటీ హాల్, పద్మనగర్, శాంతినగర్ కమ్యూనిటీ హాళ్ల‌ను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, పద్మనగర్ స్మశానవాటికలో టాయిలెట్స్, ఫెన్సింగ్ పనులను స్థానికులు తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మేయర్, కమిషనర్ ఆదేశించారు.

21వ డివిజన్ తిలక్ నగర్, స్మశానవాటికలో అభివృద్ధి పనులు, ఎల్బీ నగర్ అంతర్గత నాలాల మీద గ్రిల్స్, పారఫిట్ వాల్స్ ఏర్పాటు చేయాలని, నాలాల‌ను జేసీబీ తో డిసిల్ట్ చేయాలని స్థానికులు కోర‌గా చర్యలు తీసుకోవాలని సీఎం హెచ్ఓను మేయ‌ర్‌ ఆదేశించారు.

22వ డివిజన్ ఎస్సీ కాలనీలో కొత్త మురుగుకాలువలు, రోడ్లు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న రోడ్, డ్రైన్ లను మ‌ర‌మ్మ‌తులు, శాంతినగర్, మర్రి వెంకటయ్య కాలనీ డ్రైన్స్ , రామకృష్ణ కాలనీలో కొత్త డ్రైన్ ఏర్పాటు చేయాలని స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి మేయర్, కమిషనర్ దృష్టికి తేగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు.

23వ డివిజన్ లోని కొత్తవాడ అంధ పాఠశాలలో టాయిలెట్స్, డైనింగ్ హాల్, కమ్యూనిటీ హాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని, డివిజన్లో అంతర్గత రోడ్లు, డ్రైన్ లు ఏర్పాటు చేయాలని, తోట మైదానంలో వాకింగ్ ట్రాక్, జిమ్, ప్రహరీ, మెట్ల బావిపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలని స్థానిక కార్పొరేటర్ ఆడెపు స్వప్న, ఆడెపు శ్రీను, స్థానికులు కోరగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మేయ‌ర్ ఆదేశించారు.

24వ డివిజన్ లో మట్టేవాడ హైస్కూల్‌ను మేయర్, కమిషనర్ పరిశీలించారు. టాయిలెట్స్ మరమ్మతులు, బోర్, ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా మహబూబియా పంజెతన్ కాలేజ్ దెబ్బతిన్న రహ‌దారి మ‌ర‌మ్మ‌తుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేయర్, కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బస్వరాజు కుమారస్వామి, ఆడెపు స్వప్న, సిటీ ప్లానర్ వెంకన్న, సీఎం హెచ్‌వో డాక్టర్ రాజిరెడ్డి, డిప్యూటీ కమిషనర్, జానా, డీఎఫ్‌వో కిషోర్, సీహెచ్ఓ సునీత, ఈఈ శ్రీనివాసరావు, డీఈలు నరేందర్, రవి కిరణ్, పబ్లిక్ హెల్త్ డీఈ ఇస్రట్ జహన్, డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఏసీపీలు, ఏఈలు, శానిటరీ సూపర్ వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్ట‌ర్లు పిర్పి రమేష్, సీఓఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

– సౌజ‌న్యం
అక్ష‌రశ‌క్తి

Read more RELATED
Recommended to you

Latest news