కూతురి ప్రేమ విషయంలో తప్పు మీద తప్పు చేసిన మారుతీరావు, ఆఖరుకు తన విషయంలో కూడా చివరి తప్పు చేసేసాడు.
తిరునగరి మారుతీరావు.. మిర్యాలగూడలో ప్రముఖ వ్యాపారి. బాగా సంపాదించాడు. ఒక్కగానొక్క కూతురును అల్లారుముద్దుగా, విపరీతమైన గారాబంతో పెంచుకున్నాడు. ఆ ‘అమృత’మయి, స్థానిక దళిత యువకుడైన ప్రణయ్‌తో అనురాగం పెంచుకుని, చివరకు ఇంట్లోంచి వెళ్లిపోయి, పెళ్లి చేసుకుంది. ఈ వరుస ఓటములన్నింటికీ అక్కడే బీజం పడింది.
మారుతీరావు నిజానికి చాలా సౌమ్యుడనీ, ఎవరికీ అపకారం తలపెట్టే వ్యక్తి కాదని మిర్యాలగూడలో అయన్ను ఎరిగున్నవారందరూ చెబుతుంటారు. కూతురు చర్యతో హతాశుడైన ఆయన, తీవ్రంగా బాధపడ్డాడు. ఎంతగా అంటే, తల్లిగా ఆయన భార్య గిరిజ పడ్డ బాదకంటే వేల రెట్లు ఎక్కువగా. ఎంతోమంది, ఎన్నోరకాలుగా ఓదార్చినా కూడా ఇసుమంతయినా ఆయన క్షోభ తగ్గలేదు. పెళ్లి చేసుకుని రెండుమూడు నెలలు ఎటో వెళ్లి తిరిగి తిరిగి మిర్యాలగూడ వచ్చిన కొత్త జంట, అక్కడే కాపురం పెట్టారు. మారుతీరావు కళ్లముందే కావాలనే తిరగడం మొదలుపెట్టారు. రకరకాల ప్రయత్నాలతో ఆయన్ను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. చివరికి భారీ ఎత్తున రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదికూడా పెళ్లయిన మూన్నెళ్ల తర్వాత. ఇదంతా చూస్తున్న స్నేహితులు, బంధువులు తలోమాట అంటూండటం మారుతీరావుకు కంటగింపుగా మారింది. స్నేహితుల్లో ఒకరు, ఒక దారుణమైన సలహా ఇచ్చి, ఆయన్ను ఒప్పించారు. ఆ దారుణం 2018 సెప్టెంబరు 14న జరిగింది.
ఇదంతా మారుతీరావే చేయించాడని రుజువు చేయడానికి పోలీసులు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం రాలేదు. నిజానికి అమృత ప్రేమ విషయంలోనే పోలీసులకు మొత్తం తెలుసు. ప్రణయ్‌కి, అతని తల్లిదండ్రులకు పోలీసులు కూడా అప్పట్లో ఎంతగానో నచ్చజెప్పారు. కానీ పిల్లలు చాలా గట్టిగా, ముఖ్యంగా అమృత చాలా మొండిగా వ్యవహరించడంతో వారు కూడా మిన్నకుండిపోయారు. దాంతో జరిగిన దారుణానికి బాధ్యత వహించిన మారుతీరావును పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపారు. దాదాపు 7 నెలలు చంచల్‌గూడాలో గడిపిన ఆయన ఈ మధ్యే బెయిల్‌పై బయటికొచ్చాడు. అప్పటినుంచీ రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మారుతీరావును ఆస్థి తగాదాలు, తన షెడ్డులో గుర్తు తెలియని శవం ఇంకా సంక్షోభంలోకి నెట్టేసాయి. ఎటూ పాలుపోని ఆయన చివరకు తన ఆత్మను కూడా హత్య చేసాడు.
పిల్లలను కనగలం గానీ, వారి రాతలను కనగలమా అని నిరాశానిర్వేదాలతో మారుతీరావు ఈ ఒక్కమాట అనుకున్నా ఇన్ని దారుణాలు జరిగేవికావు. ‘ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకున్నాను. ఇక నా బతుకేదో నేను బతుకుతాను’ అని అమృత అనుకున్నా ఈ ఘోరాలు చూడాల్సివచ్చేదికాదు. కేవలం తండ్రీకూతుళ్ల మూర్ఖపు పట్టుదలలకు రెండు జీవితాలు, రెండు కుటుంబాలు బలైపోయాయి.
నిజానికి, తన ప్రేమకు అడ్డువస్తున్న తండ్రిపై అమృత విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంది. ఎన్నోరకాలుగా నచ్చజెప్పాలని చూసిన కొద్దీ అదింకా ఎక్కువయింది. ఆ కోపంతోనే ప్రి వెడ్డింగ్ షూట్లు చేయించుకుంది. ఆ విడియోలు పట్టణంలో షేర్ చేయడం ద్వారా మారుతీరావు కూడా చూడాలని ఆమె ఆకాంక్ష. ఏమాత్రం అవసరం లేని రిసెప్షన్‌ను అరేంజ్ చేయించడం కూడా తన ఎత్తుగడే. ఇవన్నీ చూసి తండ్రి రగిలిపోవాలని, కుళ్లుకోవాలని ఆశించిన అమృత, చివరికి అది తన పసుపుకుంకుమలనే బలి తీసుకుంటుందని ఊహించలేకపోయింది. తన బిడ్డను తండ్రిలేనివాడిని చేసింది.
జీవితంలో అన్నిరకాలుగా ఓడిపోయి, ప్రాణాలు తీసుకున్న తండ్రి విషయం తెలిసినా, మీడియాతో, ఎవరో మారుతీరావనే అనాథ చనిపోయినట్లు టీవీల్లో చూసినట్లు నిర్లక్ష్యంగా, పెడసరంగా మాట్లాడింది. తండ్రి అని కూడా చూడకుండా ‘మారుతీరావు చనిపోయాడని తెలిస్తే స్పందిస్తా’ అని అనగలిగింది. చివరిచూపుకు కూడా వెళ్లనని అన్న ఆమె, చివరకు అందరూ చెబితే, పోలీసు బందోబస్తు ఇస్తే వస్తానని షరతు విధించింది, ఇదీ ఆ కూతురి కర్కషత్వం.
నిజమే.. తండ్రి తనకు చేసిన అన్యాయం అంతాఇంతా కాదు. తన నిండు జీవితాన్ని బలితీసుకున్నాడు. పరువుకు పోయి, సొంత కూతురి కాపురం నాశనం చేసాడు. ఆయన బిడ్డను ప్రేమించినందుకు అభంశుభం తెలియని ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. మారుతీరావు ఈ విషయంలో ఏమాత్రం క్షంతవ్యుడు కాదు. కానీ, ఇదంతా ఎందువల్ల, ఎవరివల్ల జరిగింది? కేవలం అమృత వల్ల. తన భర్త ప్రణయ్, అత్తమామలు కూడా ‘ఇప్పుడు ఇంకా పట్టుదలలు, పంతాలు ఎందుకు?’ అన్నా కూడా వినకుండా తండ్రిని రెచ్చగొట్టింది. ఫలితం….? ఇదిగో, ఇప్పుడు ఇంతమంది అనుభవించాల్సివస్తోంది.
జీవితాలు నాశనం కావడానికి మొండి పట్టుదలలు, మూర్ఖపు ఆలోచనలు ఎంత దోహదం చేస్తాయో చెప్పడానికి మారుతీరావు, అమృతలు ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోతారు. ఇటువంటి తండ్రి, అటువంటి కూతురు ఎవరికీ ఉండకూడదని కోరుకోవడమే మనం చేయదగినది.
– రుద్రప్రతాప్