ప్రతిపక్షనాయకుడి పాత్రలో చంద్రబాబు..!

-

హమ్మయ్య…! ఎట్టకేలకు ఏపీ యాక్టింగ్‌ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. కానీ… హాశ్యర్యం.. ప్రతిపక్షనాయకుడిగా వచ్చారు. తన ప్రభుత్వ సిఎస్‌, డిజిపి, రాష్ట్ర సిఇఓలపై విరుచుకుపడ్డారు. మొన్నోరోజు ఎన్నికల కార్యాలయం ముందు ధర్నా చేశారు. మొత్తానికి రాబోయే కాలానికి ఈసారి మంచి ప్రతిపక్షనాయకుడిగా ఎదగాలని ఆయన చేసే ప్రయత్నం చూస్తుంటే ముచ్చటేస్తోంది.

చంద్రబాబునాయుడు.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ను తొమ్మిదేళ్లపాటు అప్రతిహతంగా ఏలిన రారాజు. అధికారాన్ని ఎలా చేజిక్కించుకుంటేనేమి? ముందు మంత్రయ్యాడు.. తర్వాత రాజయ్యాడు. ‘వారు’ గా ఉన్న మామగారు ‘వాడు’ అయితేనేమి? ముందు అల్లుడయ్యాడు.. తర్వాత మొగుడయ్యాడు. ‘ఒకటే పెళ్లి-ఇద్దరికి మొగుడు’ కాన్సెప్ట్‌ అప్పుడు బాగా వర్కవుటయింది. అయితే ‘ఇద్దరికి మొగుడు’ అన్న పాయింట్‌ ఇప్పుడు ‘ఇద్దరు మొగుళ్లు’గా మారడమే ఆయనకు జీర్ణం కాని విషయం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పాపం ఎప్పుడూ ఒకేరోజు పండదు. కొన్నేళ్లక్రితం తండ్రి, ప్రస్తుతం కొడుకు.. తనని ప్రతిపక్షనాయకుడి సీట్లో కూర్చోబెడతారని పాపం.. బాబు ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్‌కు తను శాశ్వతం అనుకున్నాడు.. తనే శాశ్వతం అని నమ్మేసాడు. అప్పుడూ-ఇప్పుడూ కూడా ఆయన ఏలా ఓడిపోయాడో, ఎలా ఓడిపోతాడో ఎప్పటికీ అర్ధంకాని విషయం. పచ్చపత్రికల ‘నిజాల’తో ఆయనకి నిషా నషాళానికెక్కింది. ఇప్పడప్పుడే దిగడం కష్టం. అలవాటు కానీయండి. చూద్దాం.

గత నెలరోజులుగా ప్రచారం పేరుమీద కేసీఆర్‌ను, మోడీని, జగన్‌ను అసందర్భంగా, అకారణంగా, ఏమాత్రం లాజిక్‌ లేకుండా తిట్టడం… ఎన్నడూలేంది ప్రజల కాళ్లమీద పడడం, పండుముసలి-పసిగుడ్డు తేడా లేకుండా కౌగలించుకోవడం లాంటి చేష్టలు ఆయన పరిస్థితికి అద్దంపడుతున్నాయి. ఓటమి వెంటాడుతోందన్న భయమే ఈ పిచ్చికళలన్నింటికీ కారణం. ఇవేవి సత్ఫలితాలను ఇవ్వడంలేదని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాగ్ని రగిలించైనా అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవాలనే నీచస్థాయికి దిగజారిపోయాడు. ఆఖరుకు తన పార్టీవాళ్లు, తన కులంవాళ్లు, తన బంధువులు, తన వంధిమాగధులు, ప్రజలు కూడా అసహ్యించుకునేవిధంగా మాట్లాడాడు. ఆయన నోటినుంచి వచ్చినవన్నీ సుభాషితాలుగా, శతకపద్యాలుగా అచ్చేసిన పచ్చపత్రికలు, నగ్నంగా ఊరేగించినంత పనిచేశాయి. ఆంధ్ర ప్రజలు హంసల్లాగా, ఏది వినాలో, ఏది వదలాలో విడదీసుకుని మరీ విచక్షణ ప్రదర్శించారు. నిజానికి చాలారోజులముందే వాళ్లు ముఖ్యమంత్రిని నిర్ణయించుకున్నారు.



తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరిగింది. హైదరాబాద్‌ నుంచి కట్టుబట్టలతో నెట్టేయబడ్డవాడు, కట్టలసంచులతో హైదరాబాద్‌పై దాడి చేసాడు. ఆర్థి్క ఉగ్రవాదితో పోరాడుతున్నవాడు, ప్రపంచంలోనే పేరెన్నికగన్న నలుగురు ఆర్థిక ఉగ్రవాదులను చుట్టూ పెట్టుకున్నాడు. ఇవన్నీ ఆయన చేస్తున్నప్పుడు, ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్లు చేసారు. ఇక ఆయన చూడాలి. పాపం.. నిన్నటినుంచీ చూస్తూనేఉన్నారు. అందుకే నేటి మధ్యాహ్నం వరకు ప్రజల్లోకి రాలేకపోయారు. బాబుగారి సొంత ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, లోకల్‌ పోలీసులు నిన్న రాత్రి ఇచ్చిన రిపోర్ట్‌ను, ఇప్పటిదాకా అలా చూస్తూండిపోయాడు. జస్ట్‌..ఇప్పుడే కొంచెం స్పృహలోకి వచ్చాడు గానీ, మనలోకంలో లేడు. ఈవీఎంలను టాంపర్‌ చేశారని, సైకిల్‌కు ఓటేస్తే ఫ్యానుకు పడుతున్నాయని, అసలు ఈవీఎంలు పనే చేయలేదని..ఇలా ఏవేవో పలవరిస్తున్నాడు. పర్వాలేదు లెండి. ఇంకా 42 రోజులుందిగా.. మారతాడు. మంచి ప్రతిపక్షనాయకుడిగా మెలుగుతాడు. ఇక జ(గ)ననేత పాలనతో ఆంధ్రప్రదేశ్‌ మరోతరాన్ని ఆహ్వానిస్తోంది. మార్పును స్వాగతిస్తోంది. మార్పు ఎప్పుడూ మంచినే కోరుతుంది.

ఏ పాపమూ, శాపంగా మారకుండా ఉండదు. బాబు పాపాలు మొదలుపెట్టిననాటినుండీ పక్కనేఉన్న రాధాకృష్ణ కూడా ఇక శాపగ్రస్తుడే. ఆంధ్రజ్యోతిలో పనిచేసిననాటినుంచీ, పనిచేయిస్తున్న నేటి వరకు ఆయన ‘ఛాయా’చిత్ర ప్రదర్శన అతిత్వరలో మొదలవనుంది. పాపం.. తెలంగాణవాళ్లు ఇంకా మంచివాళ్లు(?). పచ్చి విషాన్ని పేజీలనిండా చిమ్మినా, ఇంకా చిమ్ముతూనేఉన్నా, భరిస్తూనే ఉన్నారు. ఇంటర్వ్యూలు ఇస్తూనేఉన్నారు. కమ్ముకుంటున్న క్యుములోనింబస్‌ మేఘాలనుండి కాపాడటానికి రాధాకృష్ణకు మళ్లీ తెలంగాణే దిక్కు. చంద్రబాబుకి కూడా. ఎందుకంటే ఇద్దరినీ కలిపిఉంచింది ఒకే బేడీలు. ఈ శిశుపాలురిద్దరివీ వంద నిండాయి. వేటే ఇక తరువాయి.

మిగిలిన నాయకులు తెలుగుదేశం పార్టీని ఇక మంత్రబద్ధంగా, శాస్త్రోక్తంగా బంధించి సమాధి చేయనున్నారు. తర్వాతెప్పుడైనా లేచి ఒళ్లు విరవాలంటే మళ్లీ ‘ఎన్‌టీఆరే’ రావాలి. అంతవరకూ సెలవు.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version