గతేడాది కరోనా లాక్‌డౌన్ వల్ల బ్యాంకులు ఇప్పటికే తీవ్ర నష్టాల బారిన పడ్డాయి. అనేక మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోవడం, పరిశ్రమలు మూత పడడం, వ్యాపారాలు దెబ్బ తినడంతో రుణాలను చెల్లించలేని వారి సంఖ్య పెరిగింది. దీంతో బ్యాంకులకు నష్టాలు వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో ఆర్‌బీఐ మారటోరియంను ప్రకటించినందున బ్యాంకులకు కొంత ఊరట కలిగింది. కానీ ప్రస్తుతం విజృంభిస్తున్న సెకండ్ వేవ్‌తో బ్యాంకులు మరోమారు ఆందోళన చెందుతున్నాయి.
కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఇప్పటికే అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో ఆంక్షలను విధించారు. దీని వల్ల ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు సెకండ్ వేవ్ వల్ల మరిన్ని పరిశ్రమలు మూత పడే ప్రమాదం ఏర్పడింది. చాలా మంది మళ్లీ ఉద్యోగాలను కోల్పోతున్నారు. దీంతో డిఫాల్టర్ల సంఖ్య ఇంకా పెరుగుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి. ఇది బ్యాంకులకు ఆందోళన కలిగిస్తోంది.
కోవిడ్ కేసులు పెరుగుతుండడం, సెకండ్ వేవ్ ముప్పు వల్ల రానున్న రోజుల్లో మరింత ఉద్యోగాలను కోల్పోతారని, అనేక చిన్న చిన్న కంపెనీలు, పరిశ్రమలు మూతపడతాయని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. దీంతో రుణాలను చెల్లించలేని వారి సంఖ్య బాగా పెరుగుతుందని కూడా స్పష్టమవుతోంది. ఇప్పటికే రుణాలను తిరిగి రాబట్టుకోలేని పరిస్థితిలో బ్యాంకులు ఉన్నాయి. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో బ్యాంకులు కేంద్రం వైపు చూస్తున్నాయి. మరి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.