అమ్మను ప్రేమించమని కొడుక్కి చెప్తారా…?

-

ఎవరు అవునన్నా కాదన్నా… హిందుత్వ పునాదుల మీద బిజెపి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం… రాజకీయ లక్ష్యాలు మతానికి మారి దేశాన్ని మతాల వారిగా విడగొట్టడంలో భాజాపా వ్యవస్థాపకులు విజయం సాధించారని పరిశీలకులు కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించిన మాట వాస్తవం… హిందుత్వ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో బిజెపి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. అక్కడ జరిగిన అల్లర్లలో ఎక్కువగా నష్టపోయిన ఒక మతం బిజెపికి దూరంగా ఉన్నా… అక్కడ బిజెపికి మద్దతు ఇస్తున్న హిందువులకు అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉన్నా సరే… పెద్దగా బిజెపికి ఇబ్బందులు రావడం లేదు.

2017 చివర్లో జరిగిన గుజరాత్ సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ముక్కీ మూలిగి అధికారంలోకి వచ్చిందనేది తెలిసిందే. ఆ ఎన్నికల్లో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను మోడీ తమకు అనువుగా మార్చుకోవడంలో దాదాపుగా సఫలం అయ్యారు. ఉత్తరాదిలో భావోద్వేగాలు ఎక్కువ.. లెక్కలు తక్కువ. అందుకే అక్కడ ఆకలి కేకలు కూడా ఎక్కువగానే వినపడుతూ ఉంటాయి. అయితే అక్కడ అభివృద్ధి ఎలా ఉంది…? నిజంగా బిజెపి అభివృద్ధి చేసి గెలిస్తే… పది సీట్లతో ఆ పార్టీ బయటపడేది కాదు. ఏ స్థాయిలో కాంగ్రెస్ ప్రచారం నిర్వహించినా… బిజెపికి విజయం సునాయాసంగా దక్కేది. కాని అక్కడ మెజారిటి హిందువులు… హిందుత్వం అనే భ్రమలో బిజెపికి అండగా నిలబడటం కాంగ్రెస్ కి ఇబ్బందిగా మారింది.

అందుకేనేమో ఆ తర్వాత నేను హిందువు అని చెప్పుకోవడానికి రాహుల్ గాంధీ పలు యాగాలు కూడా చేసారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ హిందు కార్యకర్తలు గాంధీ కుటుంబాన్ని బ్రాహ్మణులూ అని చెప్పడం మొదలుపెట్టారు. బిజెపి హిందుత్వ నినాదంతోనే రాజకీయాల్లో నెట్టుకు వస్తుంది. ఇప్పుడు దానికి దేశ భక్తిని కూడా జోడించింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిపిన అంతర్జాతీయ యోగా డేని దాదాపు 70కి పైగా ముస్లిం దేశాల్లో జరిపారు. హిందుత్వ వాది అయిన మోడీ… హిందుత్వ సంస్థల ఆకాంక్ష అయిన హిందు మత వ్యాప్తిని చాటడానికి యోగాడే ని వాడుకున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా యోగా అనేది హిందు మతంలో భాగమే అనే సంగతి తెలిసిందే.

దేశంలో మెజారిటి హిందువుల్లో బిజెపి అంటే, కమలం గుర్తు ఉంటె హిందుత్వానికి ప్రతీకలు అనే అభిప్రాయాన్ని హిందుత్వ సంస్థలు కలిగించడంలో సఫలం అయ్యాయి. అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బిజెపి గెలుస్తూ వస్తుంది. అయితే కీలకమైన అయోధ్యలో మాత్రం రామమందిరం రాముడికి ఎరుగు… కనీసం అక్కడ రాముడ్ని కీర్తించే ప్రజలకు అభివృద్ధి గాని సంక్షేమం గాని దిక్కు లేదనే చెప్పాలి. అక్కడ ట్రాఫిక్ సమస్యలతో పాటు ఇల్లు లేక ఎందరో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. అక్కడ దుకాణాదారులు ఎక్కువ… వారి కోసం తీసుకున్న చర్యలు గాని త్రాగు నీరు సహా అనేక సమస్యలకు చూపించిన పరిష్కారాలు గాని లేవు.

కాని అక్కడ గెలుస్తున్న బిజెపి అభ్యర్ధి మాత్రం రామమందిరం మనమే కడతాం అని చెప్పుకుంటున్నారు. దానిని ప్రజలు నమ్ముతున్నారని గ్రహించిన ఎస్పి అభ్యర్ధి ఆనంద్ సేన్ ప్రజలకు వాస్తవాలు చెప్తూ వారికి జ్ఞానోదయం కలిగించే కార్యక్రమాలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి విషయం లేని ప్రసంగాలు చేసిన మోడీ… చరిత్రలో కాంగ్రెస్ మర్చిపోయిన కొన్ని కులాలను ప్రస్తావించి వారి దేవుళ్ళకు గుడులు కట్టిస్తామని చెప్పుకున్నారు. అభివృద్ధి మంత్రంతో ప్రపంచం నడుస్తుంటే, సంక్షేమానికి ప్రజలు ఆకర్షితులు అవుతుంటే ఈ హామీ ఆందోళన కలిగించింది. కొంత మంది వాటిని నమ్మి ఓట్లు వేయడం చూస్తుంటే హిందుత్వం అభివృద్దిని నడిపిస్తుందా అనే అనుమానం కలిగింది.

దేవుడ్ని, విశ్వాసాలను నమ్మడం అనేది తప్పు కాదు… ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి. కాని రాజకీయ నాయకులు అభివృద్దిని మరిచి మతం ద్వారా తమను ఆకట్టుకుంటున్నారు అని తెలిసినప్పుడు… గుడికి వెళ్తే గాని వరాలు ఇవ్వని దేవుడు… రాజకీయ పార్టీల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు కట్టిన గుడుల్లో ఉండి వారి ఆకాంక్షలను నేరవేరుస్తాడా…? కనీస అవగాహనతో కూడా ప్రజలు ఆలోచించలేరా…? దేశ భక్తి విషయానికి వస్తే… సైనికుల్లో గాని, భారతీయుల్లో గాని దేశ భక్తి అనేది బిజెపి నేర్పినా నేర్పకపోయినా ఉంటుంది. కన్న తల్లిని ప్రేమించమని కడుపుకి పుట్టిన కొడుక్కి ఎవరైనా చెప్తారా…? దేశాన్ని ప్రేమించమని బిజెపి చెప్తే ప్రేమిస్తారా…?

నా దేశం ప్రపంచానికి ఆదర్శం అని ప్రతీ భారతీయుడు ఏదోక సందర్భంలో అనుకునే ఉంటాడు. అలాంటి భారతీయుడుకి దేశం కోసం ఏ త్యాగం చేయని బిజెపి దేశ భక్తిని నేర్పిస్తే…? అది ఎంత వరకు సమంజసం… వ్యక్తులు గాని వ్యవస్థలు గాని ప్రజల విషయంలో వారి భవిష్యత్తుని మతాల ఆధారంగా చూసినప్పుడు భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అవుతుంది గాని చెందిన దేశం అవ్వదు. ఉత్తరప్రదేశ్ లో 20 శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉంటె… ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా బిజెపి ఆ వర్గానికి ఇవ్వలేదు. కాని గెలిచిన తర్వాత ఒక మంత్రి పదవి ఇచ్చింది. చివరికి ముఖ్యమంత్రిని కూడా హిందుత్వ బ్రాండ్ ఉన్న వ్యక్తినే నియమించింది.

ఆ వ్యక్తి రామమందిరం, కుంభమేళా, రాముడి విగ్రహం అంటూ హిందువులను దగ్గర చేసుకుంటున్నారనే గాని ఉత్తరప్రదేశ్ లో 18 జిల్లాల్లో ఉన్న తీవ్ర నీటి, నిరుద్యోగ, పేదరిక సమస్యల గురించి ఎక్కడా తీసుకున్న చర్యలు లేవు. ఆ వ్యక్తిని ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి పంపిస్తే ఊరి పేర్లను మారుస్తాను అని చెప్తున్నాడు గాని బ్రతుకులు మారుస్తా అని చెప్పి హిందువులను ఆకట్టుకోవడం లేదు. రాజకీయం అనేది మతాల మీద బ్రతుకుంది అనే సంగతి ప్రత్యేకంగా చెప్పకపోయినా రాజకీయ పార్టీలు మతం ఆధారంగా ప్రజలను వాడుకుంటున్నాయి అనే విషయాన్ని ప్రజలు గ్రహించకుండా తమకు జరుగుతున్న నష్టం గురించి ఆలోచించకుండా ముందుకి వెళ్ళడమే నేడు దేశం వెనకబాటు కారణాల్లో ఒకటి. కాని గ్రహించాలి… హిందుత్వం గాని, ఇస్లాం గాని, క్రైస్తవం గాని అభివృద్దిని ఎప్పుడు నడిపించలేవు.

Read more RELATED
Recommended to you

Latest news