మట్టిలో మట్టి మనిషిలో మనిషి, ప్రకృతి మరియు వికృతి మరియు విస్తృతి. తుఫాను వచ్చి చేసిన విలయం కారణంగా ముగ్గురు మృతి. విషాదం మోసుకువచ్చి ఓ గోడ కూలి ఒకరు మృతిచెందగా, ఆ విషాదంకు కొనసాగింపా అన్న విధంగా వేర్వేరు చోట్ల మరో ఇద్దరు ఆయా కుటుంబాల్లో విషాదం నింపి వెళ్లారు. వేసంగి ఎండలు, గాలులు, తీవ్ర ఉక్కపోతలు, తాగునీటికి కటకటలూ ఇవన్నీ చూసే సందర్భాల్లో ఈ సారి మాత్రం భిన్న వాతావరణం వచ్చి ఒక్కసారిగా ఉత్పాత ధోరణిని పరిచయం చేసి వెళ్లాయి. గాలుల తీవ్రత కొన్ని చోట్ల తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు.
కొన్ని చోట్ల లేవు కూడా ! కానీ తుఫాను తీరం దాటే సమయానికి తీరం వెంబడి గాలులు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్న వార్త సంబంధిత వర్గాల్లో కంటి మీద కునుకు లేకుండా చేసి పోయింది. మాయదారి తుఫాను వచ్చి వెళ్లింది. ఇక పరిహారాల లెక్క తేలితే, అందుకు అధికార యంత్రాంగం నష్ట నివారణలు లెక్క తేలిస్తే కొంతలో కొంత బాధిత వర్గాలకు ఉపశమనం.
అసని తుఫాను వెళ్లిందని అనుకోవాలి లేదా దాని ప్రభావం మరొక్కరోజు భరించాలి అని కూడా భావించాలి. లేదంటే మరో విపత్తు ముందుంది అని కూడా గుర్తించాలి. తీవ్ర తుఫానులు ముఖ్యంగా వేసవిలో తుఫానులు తగుదునమ్మా అని వస్తున్నాయి. అసలు ఈ కాలంలో ముఖ్యంగా విపత్కర పరిణామ దశల్లో ఎవరు ముందు ఎవరు వెనుక. శాస్త్ర సాంకేతిక రంగాలు పరుగులు తీస్తే ఒక తుఫాను తీవ్రతను అంచనా వేయడం అన్నదే అంతు చిక్కకపోవడం ఏంటి? ఆశ్చర్యమే కదూ! అదృష్టం కొన్ని మీడియాల అతిని ప్రజలే గుర్తించి పట్టించుకోవడం మానేశారు. కానీ వాస్తవాలన్నీ ఎలా ఉన్నాయి.
సాంకేతిక ప్రభలు మన వాకిట ఉన్నా కూడా తుఫాను గమన రీతి ఆఖరి వరకూ అంటే నిన్నటి అర్ధరాత్రి వరకూ అంతుపోలలేదు. ఇంకా చెప్పాలంటే అంతు చిక్కలేదు. సుదీర్ఘ తీరం ఉన్న నేల కదా ! ఆంధ్రావనికి ఈ పాటి సమస్యలు తప్పవు. కాదు ఇంతకుమించిన సమస్యలను మరియు సమస్యలనే తుఫానులను, రాక్షస వానలు మోసుకువచ్చిన తుఫానులను ఈ నేల చూసింది. గండం గట్టెక్కిందని అనుకోలేం. ఇవాళ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశాలే ఎక్కువ. కనుక జాగ్రత్త జాగ్రత్త.