‘‘ఏం సార్..! ఎందుకు పిలిచిండ్రు? జల్ది చెప్పుండ్రి. అవతల పెద్దమనుషుల పంచాయితుంది.’’ ఇది వరంగల్‌లోని ఒక పోలీస్‌స్ఠేషన్‌లో జరుగుతున్న తతంగం. సిఐ చెప్పకముందే కుర్చీ లాక్కుని కూర్చున్న అతగాడు.. ఒక వీధిరౌడీ. రెండుమూడేళ్ల క్రితం, ఇదే సీఐ కాకపోయినా అదే స్టేషన్‌లో గడగడ వణుకుతూ ఓ మూల కూర్చునేవాడు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కారణం ‘‘ఫ్రెండ్లీపోలిసింగ్’’
తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో, పోలీసు వ్యవస్థ కఠినంగానే వ్యవహరించేది. నిజానికి అంతకుముందు నుంచే పోలీసులంటే భయపడటం బాగాఉండేది. నిరక్షరాస్యత, పేదరికం లాంటి కారణాల వల్ల కొంత, వామపక్ష తీవ్రవాదం వల్ల కొంత, పోలీసుల సుపీరియారిటీ కాంప్లెక్స్ వల్ల కొంత.. ఇలా భయం పెరిగిపెరిగి పెద్దదయింది. దాంతో పోలీసులు కూడా, రెచ్చిపోయి, అన్ని విషయాల్లో తలదూర్చి, పంచాయితీలు చేసేవాళ్లు. వాటిల్లో భాగంగా దోషులను (?) స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టి, హింసించే ప్రక్రియ చాలాకాలం సాగింది. ఆ కాలంలో పోలీసులంటేనే అందరికి హడల్. స్టేషన్‌కు పోయినవాడెవడూ దెబ్బలుతినకుండా బయటకు రాడని చెప్పుకునేవారు. అయితే ఇందులో నిర్దోషులు, సివిల్ తగాదాలకు సంబంధించిన వాళ్లు కూడా ఉండటంతో కొంత ప్రతిఘటన మొదలైంది. దాంతో ఆత్మవిమర్శ చేసుకున్న పోలీసు విభాగం, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో మెతకబడటం మొదలుపెట్టారు. దీనికి ‘ఫ్రెండ్లీపోలిసింగ్’ అని ఒక ముద్దుపేరు పెట్టుకుని, ఆ ప్రకారం వ్యవహరిస్తూవస్తున్నారు. దీనికి తోడు, ప్రతి పోలీసుస్టేషన్‌లో సిసి కెమెరాలు, ప్రతీ గదిలో పెట్టి, హైదరాబాద్ డిజిపి ఆఫీసుకు అనుసంధానం చేసారు. దాంతో ఏ స్టేషన్‌లో ఏం జరిగినా హెడ్డాఫీసుకు తెలిసిపోయే పరిస్థితి. మొదటి డిజిపి అనురాగ్ శర్మ దీనికి ఆద్యుడు కాగా, ప్రస్తుత డిజిపి మహేందర్ రెడ్డి చాలా పటిష్టంగా అమలుచేస్తున్నారు.
ఈ ఫ్రెండ్లీపోలిసింగ్ అనే కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవడం, అమలుచేయడంలోనే అయోమయం నెలకొన్నది. స్టేషన్‌కు వచ్చిన ప్రతివారిని నమస్కరించి, కుర్చీలో కూర్చోబెట్టి మంచిచెడ్డలు వాకబు చేయడం, వచ్చినవాడు దోషి అని వారికి తెలిసినా, మంచినీళ్లిచ్చి కుశలప్రశ్నలు వేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్కన్ని కూడా కొట్టొద్దు అని స్పష్టమైన ఆదేశాలు అందటంతో పోలీసులు కూడా నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నారు. ఇప్పుడు ఆకురౌడీలు, వీధిగూండాలు, గల్లీలీడర్లు, పెద్దమనుషులుగా చెలామణీ అయ్యే సెటిల్‌మెంట్ చెంచాలు కూడా పోలీసులను బెదిరించే స్థాయికి చేరుకున్నారు.
ఇది అమెరికానో, యూరపో కాదు. ఇండియా. ‘ఎక్స్‌క్యూజ్‌మీ సర్! యూ ఆర్ అండర్ అరెస్ట్’ అంటే ఇక్కడ నడవదు. పోలీసులంటే గౌరవం ఉన్నా, లేకపోయినా, భయం మాత్రం ఖచ్చితంగా ఉండితీరాలి. ఒకప్పుడు కుటుంబ కలహాలు, మొగుడూపెళ్లాల పంచాయితీలు పోలీస్‌స్ఠేషన్‌కు వెళ్లిన వెంటనే తేలిపోయేవి. ఇప్పుడు… రోజుల తరబడి పెద్దమనుషుల పంచాయితీలు, కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు. చట్టం పోలీసులకు దండించే అధికారాన్ని ఇచ్చింది. కానీ, దాన్ని పట్టువిడువులతోనే వాడాలి. సున్నితంగా వ్యవహరించాల్సిచోట సున్నితంగానే ఉండాలి. కఠినంగా ఉండాల్సినచోట కరుకుగానే వ్యవరించాల్సిఉంటుంది. ‘ఒరేయ్ నాయనా! కొట్టేసిన నగలెక్కడ్రా?’ అని దండేసి, దండం పెడితే వాడు ఎందుకు చెప్తాడు? ఒక్కసారి వాళ్ల స్టైల్లో అడిగితే వెంటనే పిన్‌కోడ్‌తో సహా కక్కుతాడు.
తమకు ఇప్పుడు ఎవరూ గౌరవం ఇవ్వడం గానీ, భయపడటం గానీ లేదని పోలీసులు బాహాటంగానే వాపోతున్నారు. మామూలుగానే అర్ధరాత్రి, అపరాత్రి అని కాకుండా విపరీతమైన పని ఒత్తిడి. దానికి తోడు పొద్దున్నే పొలిటీషియన్ల తాఖీదులు. తమంటే పడనివాళ్లను తీసుకొచ్చి, ఓ రౌండ్ వేయాలని వాళ్ల కోరిక. ఒకప్పుడు దెబ్బలకు తాళలేక అరిచే అరుపులే వినిపించే పోలీస్‌స్టేషన్లలో, ఇప్పుడు సిఐ, ఎస్‌ఐల మీద ఎదురుతిరుగుతున్న వెధవల అరుపులు వినబడుతున్నాయి. పోలీసులు కూడా ఈ పరిస్థితి వల్ల చిత్రవధననుభవిస్తున్నారు. ఒకప్పుడు ‘బతకలేక బడవపంతులు’ అనేవారు. ఇప్పుడు ‘పొట్టకూటికోసం పోలీసోడు’ అయింది. అరెస్టు చేసాక, అమెరికా పోలీసులు కూడా ముద్దులేం పెట్టుకోరు. వాళ్ల ‘డిగ్రీ’లు వాళ్లకుంటాయి. పూలదండ వాడాలా, లాఠీ వాడాలా అనేది పరిస్థితి, సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుంది. అది ఎవరికివారే నిర్ణయించుకోవాలి. కాకపోతే డిజీపి ఆఫీసు కూడా మర్యాదలకు కొంచెం రిలాక్సేషన్ ఇస్తే మంచిది. క్షేత్రస్థాయిలో లా అండ్ ఆర్డర్ కాపాడటం కూడా పోలీసుల పనే. అక్కడ దండలతోనూ, దండాలతోనూ పనులు జరగవు. దండోపాయమే శరణ్యం.
ఇంటికి నాన్న ఎలాగో, ఊరికి పోలీసు అలాగ. తిట్టేప్పుడు తిట్టాలి, కొట్టేప్పుడు కొట్టాలి. బుజ్జగించేప్పుడు బుజ్జగించాలి. ఇద్దరి ఉద్దేశ్యం – క్రమశిక్షణ గల పౌరులను తయారుచేయడం.
-రుద్రప్రతాప్