కొన్ని లక్షల కోట్ల లీటర్ల నీటిని తోడుకుంటూ మన నీళ్లతో కూల్ డ్రింక్స్ తయారు చేసి మనకే అమ్ముతూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయే.. అందుకు వారిపై ఎంత జరిమానా వేయాలి ? అసలు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయా..?
భారతీయులుగా నిజంగా మనం సిగ్గుతో తల దించుకోవాల్సిన ఘటన ఇది. మన రైతులు పండించే పంటలపై విదేశీ బహుళజాతి కంపెనీ పెత్తనం ఏంటీ..? విడ్డూరం కాకపోతే..! విదేశీ కంపెనీలు మన సహజ వనరులను కాజేసి, మన డబ్బును దోచుకుని లక్షల కోట్ల రూపాయలను ఆర్జించడమే కాదు.. మనపై పెత్తనం కూడా చేస్తున్నాయనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. ఇంతకీ అసలు ఏం జరిగందంటే…
ప్రముఖ శీతలపానీయాల తయారీ కంపెనీ పెప్సికో తెలుసు కదా. ఆ కంపెనీ లేస్ చిప్స్‌ను తయారు చేస్తుంది. అయితే ఆ చిప్స్ కోసం ఆ కంపెనీ FL-2027 అనే ఓ రకమైన జాతికి చెందిన ఆలుగడ్డలను వాడుతుంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని కొందరు రైతులు ఎప్పటి నుంచో ఈ వంగడాన్ని పండిస్తున్నారు. వారికి పెప్సీ కో గానీ, లేస్ చిప్స్ విషయం గానీ తెలియదు. అయితే తాము ఈ రకానికి చెందిన ఆలుగడ్డలను తమ చిప్స్ తయారీ కోసం రిజిస్టర్ చేసుకున్నామని.. కనుక ఈ రకానికి చెందిన ఆలుగడ్డలను ఎవరూ పండించకూడదని చెబుతూ పెప్సీ కో ఈ రకానికి చెందిన ఆలుగడ్డలను పండించిన గుజరాత్‌కు చెందిన కొందరు రైతులపై కోర్టులో కేసు వేసింది. రూ.1.05 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాలని పెప్సీకో కోర్టులో పిటిషన్ వేసింది.
అసలే పంటలు పండక, పండినా గిట్టుబాటు ధర సరిగ్గా ఉండని అన్నదాతలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇంక వారు ఏం చేస్తారు చెప్పండి..? పంట వేయాలంటేనే అప్పో, సొప్పో చేసే రైతులు అంత భారీ మొత్తం నష్ట పరిహారం చెల్లించాలంటే ఎలా తెస్తారు..? ఈ క్రమంలో ఇప్పుడా రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతం. తాము ఎంతో కాలం నుంచి వేస్తున్న పంట ఇక పండించడం కుదరనే మాటను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆ రైతుల నుంచి కోరుతున్న సదరు నష్టపరిహారాన్ని ఆ రైతులు చెల్లిస్తే కోర్టులో కేసు లేకుండా బయటే వ్యవహారాన్ని చక్కబెట్టుకుందామని పెప్సీ కో ఆ రైతులకు ఓ ఆఫర్ కూడా ఇచ్చిందట. దీన్ని బట్టే చెప్పవచ్చు.. విదేశీ కార్పొరేట్ కంపెనీలు మనపై ఎలా జులుం చెలాయిస్తున్నాయో..!
తాము రిజస్టర్ చేసుకున్న ఆలుగడ్డ వంగడాన్ని ఇతరులు పండించడానికి వీలు లేదని చెప్పి పెప్సీ కో కేసు వేసింది సరే.. మరి వారు, అలాంటి ఇతర కంపెనీలు మన దేశంలో ఉన్న సహజ వనరులను పీల్చిపిప్పిస్తున్నాయే.. అందుకు వారికి ఏ శిక్ష వేయాలి ? కొన్ని లక్షల కోట్ల లీటర్ల నీటిని తోడుకుంటూ మన నీళ్లతో కూల్ డ్రింక్స్ తయారు చేసి మనకే అమ్ముతూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయే.. అందుకు వారిపై ఎంత జరిమానా వేయాలి ? అసలు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయా..? అన్నదాతలు కనుక వారిపై కార్పొరేట్ కంపెనీలు జులుం చెలాయిస్తున్నాయి, మరి ఆ కంపెనీలు పాల్పడే ఆగడాలకు వారికి ఏ శిక్ష వేయాలి ? వీటికి నిజంగా మన ప్రభుత్వాలే సమాధానం చెప్పాలి. కార్పొరేట్ కంపెనీల అడుగులకు మడుగులు ఒత్తినంత కాలం మన దేశంలో రైతులే కాదు, ఇతర సామాన్య ప్రజల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అది మారుతుందని మనం ఆశించడం నిజంగా అడియాశే అవుతుంది..!