మ‌హ‌ర్షి సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు నిర్ణ‌యం స‌రైందేనా..? ప్రేక్ష‌కులే బ‌లి కావాలా..?

-

పెద్ద సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడ‌ల్లా సినిమా టిక్కెట్ల రేట్ల‌ను పెంచాల్సిందేనా..? ప‌్రేక్ష‌కులే ఇందుకు బ‌లి కావాలా..? అస‌లు ఓ సాధార‌ణ సినీ ప్రేక్ష‌కుడు ఈ టిక్కెట్ల రేట్ల పెంపుపై ఏమ‌నుకుంటున్నాడు..?

మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం మ‌హ‌ర్షి నేడు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా, అల్ల‌రి న‌రేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. అయితే ఈ సినిమాకు గాను 5 రోజుల ముందే టిక్కెట్ల విక్ర‌యాలు ప్రారంభం కాగా.. ప‌లు థియేట‌ర్ల‌లో టిక్కెట్ల రేట్ల‌ను పెంచారు. దీంతో సినీ అభిమానులు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేయ‌గా, రంగంలోకి దిగిన మంత్రి త‌ల‌సాని థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

ప్ర‌భుత్వానికి చెప్ప‌కుండా సినిమా టిక్కెట్ల రేట్ల‌ను ఎలా పెంచుతారంటూ త‌ల‌సాని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పు మేర‌కే టిక్కెట్ల రేట్ల‌ను పెంచామ‌ని చిత్ర నిర్మాత‌లు చెబుతుండగా, ఈ అంశంపై హైకోర్టులో పిటిష‌న్ వేస్తామ‌ని త‌ల‌సాని అన్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి పెద్ద సినిమాలు, టిక్కెట్ల రేట్ల అంశం తెర పైకి వ‌చ్చింది. అయితే పెద్ద సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడ‌ల్లా సినిమా టిక్కెట్ల రేట్ల‌ను పెంచాల్సిందేనా..? ప‌్రేక్ష‌కులే ఇందుకు బ‌లి కావాలా..? అస‌లు ఓ సాధార‌ణ సినీ ప్రేక్ష‌కుడు ఈ టిక్కెట్ల రేట్ల పెంపుపై ఏమ‌నుకుంటున్నాడు..? అనే వివ‌రాల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే…

మ‌హ‌ర్షి చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు.. సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై స్పందిస్తూ.. త‌మ‌ది భారీ బ‌డ్జెట్ సినిమా అని.. అస‌లు ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా స‌రే.. మొద‌టి 4 రోజుల వ‌ర‌కు మాత్రమే ఆడుతుంద‌ని.. ఆ త‌రువాత పైర‌సీ వ‌ల్ల జ‌నాలు థియేట‌ర్ల‌కు రార‌ని, అందుకే టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచి ముందుగానే వ‌సూళ్లు రాబ‌ట్టుకోవాల‌ని అన్నారు. అంటే.. ఆయ‌న అన్న‌ట్లుగానే మొద‌టి 4 రోజుల్లో సినిమాకు వ‌సూళ్లు వ‌స్తే.. మరి 5వ రోజు నుంచి థియేట‌ర్ల‌లో టిక్కెట్ల రేట్ల‌ను తగ్గిస్తారా..? అందుకు స‌మాధానం ఎవ‌రు చెబుతారు..?

పెద్ద సినిమా తీశాం.. భారీగా బ‌డ్జెట్ పెట్టాం.. అని చెప్పి సినిమా టిక్కెట్ల రేట్ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లు పెంచుకుంటే.. ఇక ప్ర‌భుత్వాలు ఉండి ఎందుకు ? సినీ ప్రేక్ష‌కులు కూడా ఓ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లే క‌దా. వారికి న్యాయం చేయాల్సిన బాధ్య‌త కూడా ప్ర‌భుత్వంపై ఉంటుంది. ఇక ఎంత భారీగా బ‌డ్జెట్ పెట్టి సినిమా తీసినా స‌రే.. అది జ‌నాల‌కు న‌చ్చాలి. అప్పుడే ఆ సినిమా విజ‌య‌వంత‌మ‌వుతుంది. న‌చ్చ‌ని సినిమా తీస్తే నిర్మాత‌ల‌కు న‌ష్టం త‌ప్ప‌దు. అయితే సినిమా హిట్ అయిన ప‌క్షంలో దిల్ రాజు చెప్పిన‌ట్లు 4 రోజుల ఫార్ములా ఏం ఉండ‌దు. ప్రేక్ష‌కులు 4 రోజులు దాటినా హిట్ సినిమాను ఎప్ప‌టికీ ఆదరిస్తూనే ఉంటారు. థియేట‌ర్ల‌కు వెళ్లి మ‌రీ సినిమా చూస్తారు. దీంతో వసూళ్లు కూడా ఆటోమేటిగ్గా వ‌చ్చేస్తాయి. వాటి కోసం దిగులు చెందాల్సిన ప‌నిలేదు. గ‌తంలో ఎన్ని సినిమాలు ఎక్కువ రోజులు ఆడ‌లేదు..? అది మ‌రిచిపోయి మొద‌టి 4 రోజుల వ‌సూళ్లు ముఖ్యం అని ఎలా అంటారు..?

అయితే సినిమా బాగ‌లేక పోతే.. 4 రోజుల వ‌ర‌కు కాదు క‌దా.. క‌నీసం రెండో కూడా సినిమా చూడ‌రు. మ‌ర‌లాంట‌ప్పుడు మాకు సినిమా విడుద‌ల‌య్యాక 4 రోజుల వ‌ర‌కు వ‌సూళ్లు వ‌స్తే చాల‌ని ఎలా అంటారు..? బాగా లేని సినిమాకు రెండో రోజు నుంచే వసూళ్లు క‌ష్ట‌మని నిర్మాత‌ల‌కు తెలియ‌దా..? అప్పుడు మ‌రి 4 రోజుల వ‌ర‌కు వ‌సూళ్లు ఎలా రాబ‌డుతారు..? ఇందుకు చిత్ర నిర్మాత‌లే స‌మాధానం చెప్పాలి. ఇక పెద్ద సినిమాలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా సినిమా టిక్కెట్ల రేట్ల‌ను పెంచుతుంటే సాధార‌ణ సినీ ప్రేక్ష‌కులు తీవ్ర అసంతృప్తికి లోన‌వుతున్నారు.

అస‌లే థియేటర్ల‌లో తిను బండారాల పేరిట అడ్డగోలు దోపిడీ చేసే యాజ‌మాన్యాలు ఇప్పుడు టిక్కెట్ల రేట్ల‌ను కూడా పెంచ‌డంతో అస‌లు సినిమా చూడ‌డం అవ‌స‌ర‌మా..? ఒక్క రోజు ఆగితే పైర‌సీలో చూడ‌వ‌చ్చు క‌దా.. అని భావిస్తున్నారు. అలాంట‌ప్పుడు టిక్కెట్ల రేట్ల‌ను పెంచి ప్రేక్ష‌కుల‌ను ఏ మేర థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌ల‌రో చిత్ర నిర్మాత‌ల‌కే తెలియాలి. ఏది ఏమైనా.. సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు నిర్ణ‌యం మాత్రం స‌రికాద‌ని మెజారిటీ వ‌ర్గానికి చెందిన ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇక‌పైనైనా అగ్ర హీరోలు న‌టించే సినిమాల‌కు టిక్కెట్ల రేట్ల‌ను పెంచుతారా, య‌థాత‌థంగా ఉంచుతారా.. అన్న‌ది తెలియాలంటే.. మ‌రొక అగ్ర హీరో సినిమా వ‌చ్చిన‌ప్పుడు చూడాల్సిందే..! అప్ప‌టి వ‌ర‌కు ప్రేక్ష‌కుల జేబుల‌కు టిక్కెట్ల రేట్లు చిల్లులు పెట్ట‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version