ప్రదీప్ ఒక కంపెనీలో ఉద్యోగి. కరోనా కారణంగా నష్టాలు వచ్చాయని చెప్పి అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో అతను ఉద్యోగాల వేటలో పడ్డాడు. పలు జాబ్ పోర్టల్స్‌లో రెజ్యూమ్‌లను అప్‌లోడ్ చేశాడు. ఒక రోజు ఒక వ్యక్తి నుంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కాల్ వచ్చింది. నమ్మి రూ.5 లక్షలు ఇచ్చాడు. తరువాత ఆ వ్యక్తి పత్తా లేడు. దీంతో మోసపోయానని గ్రహించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పైన తెలిపింది ఒక ఉదాహరణ మాత్రమే. దేశంలో నిజానికి ఇలాంటి మోసాలు నిత్యం అనేకం చోటు చేసుకుంటున్నాయి. కానీ బాధితుల్లో చాలా మంది పోలీసులకు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడం లేదని పోలీసులే వెల్లడిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిని కొందరు దుండగులు ఇలా మోసం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి అందుకు ఫీజులు చెల్లించాలని చెప్పి బాధితుల నుంచి రూ.వేలు మొదలుకొని రూ.లక్షల వరకు వసూలు చేస్తూ తరువాత ఎంచక్కా ఉడాయిస్తున్నారు. ఇలాంటి కేసులు నిత్యం కోకొల్లలుగా నమోదవుతున్నాయి.
కరోనా కారణంగా మార్చి నెల నుంచి ఇప్పటి వరకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. దీంతో వారికి ఉద్యోగాలు లభించడం కష్టతరమైంది. అందులో భాగంగానే వారు ఉద్యోగాల కోసం జాబ్ పోర్టల్స్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే అలాంటి నిరుద్యోగుల డేటాను దొంగిలిస్తున్న దుండగులు వారికి కంపెనీలకు చెందిన ప్రతినిధులుగా ఫోన్లు చేస్తూ వారిని నమ్మించి అలా మోసం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు భారీగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చార్జిలను వసూలు చేయాలని చూస్తే అలాంటి వారిని నమ్మకూడదని సూచిస్తున్నారు. అందువల్ల ఎవరైనా సరే ఉద్యోగాలు ఇప్పిస్తామని, అందుకు కొంత రుసుం చెల్లించాలని చెబితే అస్సలు నమ్మకండి. అందులో నూటికి 99 శాతం మంది మోసం చేసేవాళ్లే ఉంటారు. అలాంటి వారి బారిన పడి డబ్బు నష్టపోకండి.