కేసీఆర్.. రాజకీయ చాణక్యుడని గత దశాబ్దకాలంగా ఆయనను గమనిస్తున్న వారు చెప్పే మాట. కేసీఆర్ ఊరికే మాట్లాడరు ఆయన చెప్పాడంటే అవుతుందంతే అనేది టీఆర్ఎస్ అభిమానుల నమ్మకం. కేసీఆర్‌ని నమ్మితే నడిసముద్రంలో మునిగినట్టే అనేది కాంగ్రెస్ విమర్శ.. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతానంటూ మస్కా కొట్టారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు. షేర్ అంటే సవా షేర్ అంటూ విరగబడటం కేసీఆర్ మార్క్.. మరి అలాంటి కేసీఆర్ గత సంవత్సర కాలంగా ఎందుకు నెమ్మదించారు..?? అనేది ప్రశ్న.. కాగా కేసీఆర్ ఏది చేసినా దాని వెనకాల బలమైన కారణం, రాజకీయ ఎత్తులుంటాయి.. అనేది సమాధానంగా వినవస్తుంది.
కేసీఆర్ కేంద్రంతో తలపడేందుకు రంగం సిద్ధం చేసుకొని ఫెడరల్ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్నానంటూ హడావిడి చేశాడు కొన్ని రోజులు.. కట్ చేస్తే ఆ ఊసే లేకుండా కామ్ అయిపోయారు. కేంద్రం తీసుకువచ్చిన రైతుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర బంద్ ప్రకటించారు.. ఉన్నట్టుండి రైతు చట్టాలకు మద్దతు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇన్నిరోజులు తెలంగాణలో అనుమతించని కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఓకే చెప్పేసింది. ఇక కేసీఆర్ అడుగు జాడల్లో నాయకుడిగా దూసుకుపోతున్న కేటీఆర్.. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోవాలంటూ స్నేహగీతం ఆలపించారు..
కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గారా..? కేటీఆర్ చల్లబడ్డారా..? అనే ప్రశ్నలు వస్తున్నతరుణం.. అదే సమయంలో కేసీఆర్ జైలుకెళ్ళడం ఖాయం అంటూ బండి సంజయ్ విమర్శల జడి మొదలు పెట్టాడు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధుల వివరాలు చెబుతూ దూకుడు కొనసాగిస్తున్నాడు. నిజంగానే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయినట్లుగా అనిపిస్తుంది.
కానీ ఇదంత ఒకవైపు మాత్రమే.. మరి రెండో వైపు తెలంగాణ బీజేపీ సారథి బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మాత్రం గరం గరం అవుతున్నారు. ఇదేంటి పార్టీ నాయకత్వమేమో కేంద్రానికి సపోర్ట్ చేస్తూ ఉంటే.. వారి నాయకులు మాత్రం భిన్నంగా విరుచుకుపడుతున్నారు..? వీరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా…? కేసీఆర్ బీజేపీతో రాజీకి వచ్చాడా..? అనేది ప్రశ్న.. నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఇది పక్కా కేసీఆర్ మార్క్ రాజకీయ ప్రణాళిక. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొనే మునుముందు అలాంటి ఫలితాలు రాకుండా ఉండేందుకు.. బీజేపీ పార్టీని ఎదగకుండా ఆపేందుకు చేస్తున్న ప్రణాళికగా కనిపిస్తోంది.. ఇప్పుడు గనక బీజేపీకి కేసీఆర్‌తో దోస్తానా చేసే ఆలోచన ఉన్నట్టైతే… ఇక బీజేపీ ఎప్పటికీ తెలంగాణలో నిలబడలేదు. కాంగ్రెస్‌కి జరిగినదే రిపీట్ అవుద్దీ..