అభిమానచట్రంలో మహేశ్‌ బాబు..!

-

రొటీన్‌ ఫార్ములాను సేఫ్‌ జోన్‌గా, కంఫర్ట్‌ జోన్‌గా హీరోలు ఫీలయినంతకాలం దెబ్బలు తగులుతూనేఉంటాయి. మహేశ్‌ బాబయినా, పవన్‌ కళ్యాణయినా మినహాయింపేమీ ఉండదు. నమ్మాల్సింది దురభిమానులను కాదు..

‘మహర్షి’ సినిమా ప్రిరిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో హీరో మహేశ్‌ బాబు తన మనసులోని మాటలను చెప్పారు. ముఖ్యంగా అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, వాళ్లకి రుణపడిఉంటానని చాలా ఉద్వేగంగా అన్నారు. కానీ ఆయనకు తెలియనిది అసలు అభిమానులంటే ఎవరు? దురభిమానులంటే ఎవరు? అని. అయనలోని నటుడిని బయటకు రాకుండా బంధించింది ఎవరనేది అర్థం చేసుకుంటే పదికాలాలపాటు సూపర్‌స్టార్‌గా కొనసాగే అవకాశముంటుంది.

మొత్తానికి మహేశ్‌బాబు 25 సినిమాలు పూర్తిచేసాడు. తెలుగు సినిమాలలో ఆయనను మించిన అందగాడు లేడు. ఆ మాటకొస్తే చుట్టపక్కల కూడా ఎవరూ కనబడటంలేదు. సరే, నాన్న పెద్ద హీరో అవడం వల్లయితేనేం, మంచి కథల వల్లయితేనేం, దర్శకుల వల్లయితేనేం… మంచి హిట్‌ సినిమాలు ఇవ్వగలిగాడు. అలాగే, పరిశ్రమ మరిచిపోలేని షాక్‌లు కూడా ఇచ్చాడనుకోండి. ఈమధ్యే విడుదలైన ‘మహర్షి’ మంచి టాకే తెచ్చుకుంది. కాకపోతే ఆయన ఇదివరకే చేసిన సినిమాలనే కలిపి వండారని తెలియడంవల్ల, యావరేజ్‌ టాక్‌తో బయటపడింది. డిజాస్టర్ మాత్రం కానందుకు సంతోషించాలి.

ఈ సినిమా విడుదలకు ముందు మహేశ్‌, విలేకరులతో మాట్లాడుతూ, తన ప్రగతిలో పాలుపంచుకున్నందుకు, తోడ్పాటునందించినందుకు చాలా మందిని తలుచుకున్నాడు. అందులోనూ, అభిమానులంటూ ఓ వర్గానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసాడు. ఇంతకీ అయన అనుకుంటున్న అభిమానులెవరో ఆయనకే తెలియాలి. ఏ నటుడికైనా అభిమానులంటే రెండు రకాలుగా ఉంటారు. ఒకరు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అంటూ, గుంపుగా ఏర్పడి, విడుదల రోజు ఫ్లెక్సీలు కట్టి, రంగులు చల్లి, కాగితాలు ఎగరేసే రకం. రెండోరకం, అరె.. మహేశ్‌ సినిమా వచ్చింది, తప్పకుండా చూడాలి, బాగా యాక్ట్‌ చేస్తాడు… అనుకుంటూ మనసులో ఒక మంచి అభిప్రాయం పెట్టుకుని, తప్పకుండా సినిమా చూసేవాళ్లు.

మొదటిరకం ఫ్యాన్స్‌ చాలా ప్రమాదకారులు. వీరి అభిమానం అనేది రకరకాల కారణాలవల్ల పుడుతుంది. అది కులం, మతం, వారసత్వం, బాధ్యతారాహిత్యం… ఇలా చాలా ఉంటాయి. చాలా వరకు వీళ్లు ఎటువంటి బాదరబందీ, చదువు, ఉద్యోగం, బాధ్యతాలేని పోరంబోకు బ్యాచ్‌. ఇక్కడ కథ, కథనం, నటన, దర్శకత్వ ప్రతిభ లాంటివేం పనికిరావు. అసలు అవి వాళ్లకు తెలియదు కూడా. అసలు ఇంకా మొదటి సినిమా విడుదల కాని హీరోకు కూడా బ్యానర్లు కట్టే మహానుభావులు. వీళ్లనే నటులు పాపం.. అభిమానులని భ్రమపడుతుంటారు. వీళ్ల కోసమే మూస సినిమాలు చేసి దెబ్బతింటారు. ఏ హీరోనైనా ఇమేజ్‌ అనే ఓ బుడగలో బంధించి, ఓ ఇంట్రడక్షన్‌ సాంగ్‌, ఫైట్‌, కామెడీ, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్‌.. ఇలా ఓ పరమచెత్త ఫార్ములాతో సినిమాలు తీసేలా ఎంకరేజ్‌ చేస్తుంటారు. ఇంతా చేస్తే, వీళ్లు పిడికెడు మంది. వీళ్లతో వచ్చేదేమీలేదు గానీ, పోయేది మాత్రం బీభత్సంగా ఉంటుంది.

ఇక రెండోరకం వాళ్లు నిజమైన అభిమానులు. మనసావాచా ఆ నటుడిని గుండెల్లో పెట్టుకుంటారు. వీళ్లకి ఆ నటుడంటే ఎప్పుడు, ఎలా అభిమానం పుట్టిందో తెలియదు. కానీ, చాలా తీక్షణంగా సినిమాను చూస్తారు. తమ అభిమాన నటుడినుండి గొప్ప ప్రదర్శనను ఆశిస్తారు. కథలోని ఆత్మను ఎలా ఆకలింపు చేసుకున్నాడనేది, దానికి తగ్గట్టుగా పాత్రలో ఎలా ఒదిగిపోయాడనేదే వీరికి ముఖ్యం. ఇది నిబద్ధత గల సమూహం. ఆడామగా తేడా లేదు. బ్యాచిలర్లా, ఫ్యామిలీనా సంబంధం లేదు. పక్కా ఆర్గానిక్‌ ట్రాఫిక్‌. సినిమా చూసేవాళ్లలో వీళ్లే 75 శాతం ఉంటారు. ఒక సినిమా హిట్టా..ఫట్టా తేల్చేది కూడా వీరే. వీరినే నమ్మాలి. తాను ఎటువంటి పాత్ర చేసినా, ఆదరించేవాడే నిజమైన అభిమాని.

ఇప్పుడిప్పుడే, తెలుగు యువ కథానాయకులు ఈ విషయమై కొంత సీరియస్‌గానే ఆలోచిస్తున్నారు. అందువలనే వైవిధ్యభరితమైన చిత్రాలు వస్తున్నాయి. ఎటువంటి ఇమేజ్‌ చట్రంలో బందీలు కాకుండా, అయినాకూడా వాటిని తెంచుకుని వచ్చిన కథానాయకులకు కావలసినంత పేరు దక్కుతోంది, రామ్‌చరణ్‌ ధృవ, రంగస్థలం, నాని జెర్సీ, విజయ్‌ దేవరకొండ టాక్సీవాలా, గీతగోవిందం, నాగచైతన్య మజిలీ.. ఇలా భిన్నంగా వచ్చిన సినిమాలు ఎలా విజయం సాధించాయో మనకు తెలుసు.

అదే రామ్‌చరణ్‌ మళ్లీ ఫార్ములాతో తీసిన ‘వినయ విధేయ రామ’ ఎంత దెబ్బేసిందో కూడా తెలుసు. నమ్మాల్సింది కథలో నవ్వత, దర్శకుడి ప్రతిభను కానీ, దురభిమానులను కాదు. ఈ విషయంలో హిందీ, తమిళ, మళయాళ కథానాయకులు ముందంజలో ఉన్నారు. ఈ రొటీన్‌ ఫార్ములాను సేఫ్‌ జోన్‌గా, కంఫర్ట్‌ జోన్‌గా హీరోలు ఫీలయినంతకాలం దెబ్బలు తగులుతూనేఉంటాయి. దూకుడు హిట్టయిందని ఆగడు, సీతమ్మ వాకిట్లో… విజయం సాధించిందని బ్రహ్మోత్సవం, అత్తారింటికి… అదిరిందని అజ్ఞాతవాసి తీస్తే ఫలితాలు మరి దారుణంగానే ఉంటాయి. ఇందుకు మహేశ్‌ బాబయినా, పవన్‌ కళ్యాణయినా మినహాయింపేమీ ఉండదు.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version