మోడీజీ.. లక్షల మంది కడుపులు కొడతారా..?

-

ప్రధాని మోదీ ఇటీవల ఓ నిర్ణయం ప్రకటించారు.. అక్టోబర్ 2 నుంచి 12 రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. ఆ వస్తువుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ను పూర్తిగా నిషేధిస్తామని, దీన్ని దశల వారీగా అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు.

ఇంతకీ నిషేధించే వస్తువులు ఏంటంటే… క్యారీ బ్యాగ్స్‌(50మైక్రాన్స్‌ కంటే తక్కువ), నాన్‌-వోవెన్‌ క్యారీ బ్యాగ్స్‌, ప్లేట్లు, ల్యామిననేటెడ్‌ బాణాలు, ప్లేట్లు, చిన్న ప్లాస్టిక్‌ కప్పులు, కంటెయినర్స్‌ (150ఎంఎల్‌, 5గ్రాముల కన్నా తక్కువ), ఇయర్‌ బడ్స్‌కి ఉపయోగించే ప్లాస్టిక్‌ పుల్లలు, బెలూన్లు, జెండాలు, క్యాండీస్‌, సిగరెట్‌ బట్స్‌, పాలీస్టైరెన్‌, బేవరేజెస్‌కు ఉపయోగించే చిన్న ప్లాస్టిక్‌ (200ఎంఎల్‌ కన్నా తక్కువ), రోడ్లపై పెట్టే బ్యానర్లు (100 మైక్రాన్స్‌) మొదలైనవి.

వీటిలో చాలా వరకూ నిత్య జీవితంలో అందరూ వాడేవే.. ఈ ప్లాస్టిక్‌ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయాలను చెప్పాలని కేంద్రం ప్లాస్టిక్‌ ఇండస్ట్రీలను కోరింది. అయితే వీటిని అకస్మాత్తుగా నిషేధించడం వల్ల ఈ పరిశ్రమలపై ఆధారపడేవారి జీవనోపాధి కోల్పోతుందన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఇది లక్షల మంది కి ఉపాధి కల్పిస్తుంది. పెట్‌ ప్లాస్టిక్‌ బాటిల్‌ ఇండస్ట్రీ ఒక్కటే రూ. 7.5లక్ష కోట్ల టర్నోవర్‌ చేస్తోంది.

ప్లాస్టిక్‌ పరిశ్రమ వల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. అలాంటి వస్తువులను నిషేధిస్తే వారి ఉపాధి సంగతేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. పర్యావరణం కోసం ప్లాస్టిక్ ను నిషేధించాల్సిందే. దాన్ని ఎవరూ తప్పుబట్టరు.. కానీ తగిన సమయం ఇవ్వకుండా.. ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇలా నిషేధం విధిస్తే.. దానిపై జీవించే కార్మికుల భవితవ్యం ఏంటన్నదే చిక్కుప్రశ్న.ఈ నిషేధానికి అనుగుణంగా అందరినీ ముందుగా సమయాత్తం చేస్తే బావుండేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news