అధికార పార్టీ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏమీ చేయకపోయినా.. చేశామని చెప్పుకున్న నేతలకు బుద్ధొచ్చేలా ఏపీ ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పు ఇచ్చారు.
జగన్.. ఆ పేరు చెబితేనే జనాల నుంచి వచ్చే అపూర్వ స్పందన.. ఆయన్ను చూడగానే పేదల కళ్లలో కనిపించే ఒక మెరుపు.. తమను ఆదుకుంటాడని.. తమను కష్టాల నుంచి దూరం చేస్తాడనే ఒక ఆశ.. పేద ప్రజల గుండెల్లో కొలువుదీరిన రాజన్న కొడుకుగా.. ఆయన ఆశయాలకు, ఆదర్శాలకు వారసుడిగా.. పేద ప్రజల గుండె చప్పుడుకు నిలువెత్తు రూపంగా.. అన్నింటికీ మించి ఒక జన నేతగా.. జగన్.. సీఎం అయిన వేళ.. అద్భుతం..!
పేద ప్రజల కష్టాలు, కన్నీళ్లను తుడవాలన్నదే మొదట్నుంచీ జగన్ అభిమతం. అందుకనే ఆయన వైఎస్సార్ (యువజన శ్రామిక రైతు) కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. మాట తప్పవద్దని.. మడమ తిప్పవద్దనే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నదే జగన్ లక్ష్యం. విద్, వైద్యం, ఉద్యోగం, వ్యవసాయం, మహిళా సంక్షేమం.. తదితర అనేక అంశాల్లో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడమే ధ్యేయంగా జగన్ ముందుకు కదిలారు. వైఎస్ మరణంతో ఆగిపోయిన గుండెలకు చెందిన కుటుంబాలను పరామర్శించే దిశగా మొదలైన యాత్ర.. మొన్నటి వరకు ప్రజా సంకల్ప యాత్రగా సాగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక యాత్రల్లో ప్రజలు పడుతున్న కష్టాలను, వారి సమస్యలను జగన్ నేరుగా తెలుసుకున్నారు. వారికి నేనున్నాంటూ భరోసా ఇచ్చారు. ఆ నమ్మకమే నేడు జగన్‌ను సీఎంను చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల కుట్రలను భగ్నం చేస్తూ జగన్ ముందుకు కదిలారు. అక్రమాస్తుల కేసులంటూ భయపెట్టినా ఆయన వెన్ను చూపలేదు. ముందుకే సాగారు. నేడు అవే కేసులు ఒక్కొక్కటిగా పేక మేడల్లా కూలిపోతున్నాయి. జగన్‌ను అరెస్టు చేయించడంలో, ఆయనపై కేసులు నమోదు చేయించడంలో ప్రతిపక్ష పార్టీలన్నీ చేసిన కుట్రలు కూడా నేడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో జగన్ ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో తెలుసుకునేందుకు ప్రజలకు క్షణమైనా పట్టలేదు. అందుకనే ఆయన్ను వారు జననేతగా ఎన్నుకున్నారు.
జైలులో ఉన్నా, జైలు నుంచి బయటికి వచ్చినా జగన్ ధ్యాస అంతా పేద ప్రజల పైనే. వైఎస్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ.. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నేనున్నాంటూ భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగారు. నవరత్నాలను ప్రవేశపెట్టి పేదలకు తమ జీవితంపై ఓ నమ్మకం కలిగించారు. తాను సీఎం అయి అధికారంలోకి వస్తే.. ఏం చేస్తానో చెప్పారు. వాటిని ప్రజలు నమ్మారు. ప్రజా నాయకుడికి పట్టం కట్టారు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. జగన్ బలమైన ప్రతిపక్ష నేతగా ప్రజల గుండెల్లో నిలిచారు. వారికి కలిగే సమస్యలపై నిరంతరం స్పందించారు. అనుక్షణం పేదల వెన్నంటే ఉన్నారు.
అధికార పార్టీ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏమీ చేయకపోయినా.. చేశామని చెప్పుకున్న నేతలకు బుద్ధొచ్చేలా ఏపీ ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పు ఇచ్చారు. 5 ఏళ్ల సమయంలో ప్రతిపక్ష పార్టీ ఆలోచనలను ఎప్పటికప్పుడు కాపీ కొడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలిచ్చి, సొంత ప్రయోజనాలే ఎజెండాగా పనిచేసిన అధికార పార్టీ నేతలకు ప్రజలు చెంప పెట్టులా ఫలితాన్ని ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీపై అధికార పార్టీ పాల్పడిన కుట్రలకు, కుతంత్రాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు శిరోధార్యం వంటిది. ఇన్ని రోజుల పాటు పచ్చ పార్టీ సాగించిన అక్రమాలకు, పాల్పడిన అవినీతికి ప్రజలు చరమగీతం పాడిన రోజిది. అవును… ప్రజలే గెలిచారు. జగన్ నమ్మకాన్ని గెలిపించారు. జనహృదయ నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇక ప్రజా సంక్షేమమే తరువాయి..!