అప్పుల పాలైపోతున్న గ్రామీణ భారతం…! ఎప్పుడు బయటకు వస్తుంది…??

-

గ్రామాలు దేశానికి పట్టు కొమ్మలు… ఈ మాట వినడానికి బాగానే ఉంది గాని నేటి వాస్తవ పరిస్థితికి మాత్రం అది సరిపడే విధంగా లేదు. అవును ఆ మాట నేడు వినడానికి కూడా బాలేదు. గ్రామాలు ఇప్పుడు అప్పుల పాలైపోతున్నాయి. పట్టు కొమ్మల ఆకులు రాలిపోతున్నాయి. వడ్డీలు కట్టలేక గ్రామీణ భారతం ఇప్పుడు కుదేలు అయిపోతుంది. కోలుకోలేక అవస్థలు పడుతుంది.

రైతులు, కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఇలా రోజు గడవడానికి, తమ వ్యక్తిగత అవసరాలకు, కుటుంబ అవసరాలకు స్తోమతకు మించి అప్పులు చేస్తూ వస్తున్నారు. గ్రామాల్లో ఆర్ధికంగా బలంగా ఉండే వాళ్ళ వద్ద అప్పులు తీసుకుంటూ వాళ్ళు డిమాండ్ చేసిన వడ్డీ కడుతున్నారు. ఉదాహరణకు పది వేలు అప్పు కావాల౦టే ముందు అసలు మొత్తంలో 500 కట్ చేసుకుని ఇస్తున్నారు.

ఆ తర్వాత పది రూపాయల వడ్డీకి పైగా వసూలు చేస్తున్నారు. దీనితో ఆ వడ్డీ కట్టేసరికి 20 వేల వరకు అవుతూ వస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో వడ్డీల వ్యాపారం చేస్తున్న వాళ్ళు దీన్ని ఆసరాగా తీసుకుని వసూళ్లు చేస్తున్నారు. వెయ్యి రూపాయలు అత్యవసర పరిస్థితుల్లో అప్పు తీసుకున్నా సరే 300 వరకు దానికి వడ్డీ కట్టే పరిస్థితి ఉందీ అంటే ఏ స్థాయిలో ఈ వడ్డీ వ్యాపారాలు గ్రామీణ భారతాన్ని ఇబ్బంది పెడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

రైతులు బ్యాంకుల్లో వచ్చే రుణాలు సరిపడక వ్యవసాయం కోసం భారీగా అప్పులు చేస్తున్నారు. లక్ష రూపాయలు అప్పు చేసి పంట అవ్వగానే తీర్చినా దానికి 50 వేల వరకు వడ్డీ పడుతుంద౦టే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే రైతులు గిట్టు బాటు ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈ వడ్డీలు వాళ్లకు చుక్కలు చూపిస్తున్నాయి. గ్రామాల్లో వ్యవసాయ యంత్రాలతో కూలీలకు పనులు ఉండటం లేదు.

ఈ తరుణంలో వాళ్ళు కుటుంబ అవసరాల కోసం అప్పులు చేసి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసి అప్పులు తీర్చే పరిస్థితి. ఇక ఇళ్ళు తనఖా పెట్టడం, ఇష్టపడి కొనుక్కున్న వాహనాలు, పశువులు అమ్మడం ఇలా జీవనాధార పనిముట్లను తాకట్టు పెట్టుకోవడం వంటివి చేస్తూ వస్తున్నారు. ఇలా అప్పులు తీర్చలేని వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

అప్పులు తీర్చలేక కొంత మంది ఏడాది పాటు పనులకు ఒప్పుకోవడం, తమ పిల్లలను పనులకు కుదిర్చి అప్పులు తీర్చడంతో వాళ్ళ కుటుంబాలు గడవకపోవడం, భార్యా భర్తలు అప్పులు తీర్చడం కోసం కష్టపడటం, దీనితో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారడం వంటివి జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలల్లో ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందని కొన్ని కొన్ని పరిణామాలు స్పష్టంగా చెప్తున్నాయి. మరి ఈ అప్పుల నుంచి గ్రామీణ భారతం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news