రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

-

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయింది. పరారీలో ఉన్న ఆయన తనపై ఉన్న కేసులన్నీ దురుద్దేశపూరితమైనవనీ, వాటిని వెంటనే రద్దు చేయాలని కోర్టును కోరగా, ఉన్నత న్యాయస్థానం నిర్ద్వందంగా తిరస్కరించింది.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. సైబర్‌ క్రైం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవిప్రకాశ్‌ బుధవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదంటూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. కాగా గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్‌ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్న విషయం విదితమే.

ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌కు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో ఇచ్చిన గడువు ముగియడంతో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. మరోవైపు న్యాయస్థానంలో కూడా ఎదురుదెబ్బ తగలడంతో రవిప్రకాశ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతారా? లేక పోలీసుల ఎదుట లొంగిపోతారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్‌ బుధవారం పోలీసుల ఎదుట హాజరుకాకపోతే అరెస్టు వారెంట్‌ జారీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారని సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా పరారీలోనే ఉండటం గమనార్హం.

ఇంతకీ రవిప్రకాశ్‌ ఎక్కడ?

ఇంతకీ రవిప్రకాశ్‌ ఎక్కడున్నాడన్న విషయం ఎవరికీ అంతుబట్టట్లేదు. ఆయన ముంబైలో ఉన్నారని, హైదరాబాద్‌లోని సన్నిహితుల వద్ద ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన సెల్‌ఫోన్, సోషల్‌ మీడియాలో ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆచూకీపై స్పష్టత లేకుండాపోయింది. కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు తమకేం తెలియదని సమాధానమిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన తొలిరోజు తానెక్కడికీ పారిపోలేదని, తన వార్తలు తానే చదువుకున్న రవిప్రకాశ్‌, పరారీలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందని సామాజిక మాధ్యమాల్లో విరివిగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version