ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాక కాంగ్రెస్ కే టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని అనుకుంటే.. వైసీపీతో కలసి ఆ కూటమిలోకి వెళ్లాలని కూడా టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే అదే జరిగితే.. ఒకే కూటమిలో టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీలు ఉంటాయి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. అవును అది నిజమే. కొన్ని రోజుల పాటు కొందరు శత్రువుల్లా ఉంటారు. ఆ తరువాత వారు మిత్రులవుతారు. ఇక మొదట్లో మిత్రులుగా ఉన్న కొందరు తరువాత శత్రువులుగా మారిపోతారు. అయితే ఈ మార్పు కూడా ఎల్లకాలం ఉండదు. మళ్లీ సీన్ రివర్స్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంటే.. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న నాయకుడు, రేప్పొద్దున ఇదే పార్టీలో ఉంటాడా.. అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ క్రమంలోనే పార్టీలు మారే నేతలతో రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ మారిపోతుంటాయి. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ కూడా ఇదే తరహా పరిస్థితిలో ఉందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పారు. కానీ అది సాధ్యం కాలేదు. అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఒకదానికొకటి శత్రువుల్లా మారాయి. ఈ క్రమంలోనే ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు టీఆర్ఎస్‌లో చేరారు కూడా. అయితే కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాయనే కారణంతో కేసీఆర్ ఈసారి కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ నినాదం ఎత్తుకున్నారు. అందులో భాగంగానే దేశంలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను కూడా కేసీఆర్ కలిశారు. రానున్న ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో హంగ్ ఏర్పడే స్థితి ఉందని సర్వేలు చెప్పడంతో కాంగ్రెస్, బీజేపీలను కాదని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నది కేసీఆర్ ఆకాంక్ష.
అయితే ఒక వేళ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాకపోతే..? కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వస్తే..? సీఎం కేసీఆర్ ఎటు వైపు ఉంటారు..? మొదట్నుంచీ శత్రువులా భావిస్తూ వస్తున్న కాంగ్రెస్ వైపా ? లేక బీజేపీ వైపా ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రశ్నకు కొందరు రాజకీయ పండితులు సమాధానం చెబుతున్నారు. అదేమిటంటే.. ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాని పక్షంలో కేసీఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారని వారంటున్నారు. అయితే మరి ఆ కూటమిలో ఇప్పటికే చంద్రబాబు ఉన్నారు కదా. మరి అందులో కేసీఆర్ ఎలా ఇముడుతారు ? అని మరొక ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కానీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాక కాంగ్రెస్ కే టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని అనుకుంటే.. వైసీపీతో కలసి ఆ కూటమిలోకి వెళ్లాలని కూడా టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే అదే జరిగితే.. ఒకే కూటమిలో టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీలు ఉంటాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయాల్లోనే అదొక సంచలన మార్పు అవుతుంది. అయితే మరోవైపు బీజేపీ కూడా వైసీపీ, టీఆర్ఎస్ ఎంపీ సీట్ల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మరి చివరకు.. టీఆర్ఎస్, వైసీపీలు ఏ పార్టీకి మద్దతు ఇస్తాయో.. వేచి చూస్తే తెలుస్తుంది..!