ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా దిగిపోయాక ఆ పదవిలోకి ఇప్పుడు ఎవరు వస్తారా..? అని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
గతంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మొన్నీ మధ్యే జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి పాలైన విషయం విదితమే. ఈ క్రమంలోనే మరోవైపు ఆ పార్టీకి చెందిన నేతలు ఇప్పుడు టీఆర్‌ఎస్, బీజేపీలోకి క్యూ కడుతుండడం ఆ పార్టీ పెద్దలకు, ముఖ్యంగా అధినాయకత్వానికి మింగుడు పడడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం కొట్టుమిట్టాడుతోంది. అయితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే.. పీసీసీ అధ్యక్ష పదవి నియామకాన్ని త్వరగా చేపట్టాలని ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందట.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా దిగిపోయాక ఆ పదవిలోకి ఇప్పుడు ఎవరు వస్తారా..? అని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆయన పదవీకాలం అతి త్వరలోనే ముగియనుండడంతో ఆయన స్థానంలో కోమటిరెడ్డి లేదా రేవంత్ రెడ్డికి గానీ ఆ పదవిని కట్టబెట్టవచ్చని సమాచారం. అయితే ఇద్దరిలో ఏ ఒక్కరికి పదవిని ఇచ్చినా.. మరొకరు పార్టీని వీడుతారని కాంగ్రెస్ పెద్దలకు తెలిసిందట. దీంతో ఇద్దరిలో ఎవరికి పీసీసీ చీఫ్ పదవి ఇద్దామా అని కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇద్దరిలో ఎవరైనా ఒకరికి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే సమస్య వస్తుంది కనుక.. ఇద్దరికీ కాకుండా.. గ్రేటర్‌కు చెందిన ఓ నాయకుడికి లేదా.. మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబుకి ఆ పదవి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నదట. అందుకనే స్వయంగా రాహుల్ గాంధీ ఈ విషయంలో చొరవ తీసుకుని ఆయనే టీపీసీసీ చీఫ్‌ను నియమిస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల వరకు టీపీసీసీ చీఫ్ పదవికి రెండు టర్మ్‌లు పూర్తవుతాయి కనుక.. భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే సత్తా ఉన్న నేతకే టీపీసీసీ చీఫ్ పదవిని కేటాయిస్తారని కూడా ఓ వర్గం ప్రచారం చేస్తోంది. మరి ఈ విషయంలో స్పష్టత రావాలంటే.. మరికొన్ని రోజుల వరకు వేచి చూడక తప్పదు..!