తండ్రి అకాలమరణంతో అనుయాయూలను ఒక్కటిగా చేసేందుకు పార్టీ పెట్టి, ఆయన్నే ఆదర్శంగా తీసుకుని 3600 కి.మీలకు పైగా పాదయాత్ర చేసి, ముఖ్యమంత్రి అవినీతినే తన ఆయుధంగా మలచుకున్న యువకుడు ఇంకో పక్కా..
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ టెన్షన్లు ఎక్కువవుతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ టెలివిజన్ చానెళ్లకు నిద్రపట్టడంలేదు. సర్వేల మీద సర్వేలు చేస్తూ, తమ విశ్వసనీయతను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాలు తాము చెప్పినట్లే వచ్చాయని అన్ని చానెళ్లు చెప్పుకుంటున్నాయి. అయితే నిజమేంటో ప్రేక్షకులకు తెలుసు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక సర్వేలు బొక్కబోర్లాపడ్డాయి. లగడపాటి తన పైత్యపు సర్వేతో జనాలను తికమకపెట్టాడు. దాన్ని నమ్మిన మహాకూటమి సభ్యులందరూ ఊహలపల్లకీలో తేలిపోయారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని, టిఆర్‌ఎస్ వేవ్ బలంగా ఉందని, జనాలు కేసీఆర్‌కే ఓటేయ్యాలని ముందే నిర్ణయించుకున్నారని, అనుభవజ్ఞులు, ప్రత్యక్షంగా పర్యటించి తెలుసుకున్నవారు చెప్పినా ఎవరూ వినలేదు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒకడుగు ముందుకేసి, కేసీఆర్‌ను ఇక మాజీ ముఖ్యమంత్రి అని రాయాల్సివుంటుంది కాబట్టి, మీరు ఇప్పటినుంచే అలా ప్రాక్టీస్ చేయమని తన డెస్క్ సిబ్బందిని ఆదేశించాడని ఆక్కన్నుంచే అందిన ఒక కబురు. కానీ తీరా ఫలితాలు వచ్చాక చాలా మందికి గుండెపోటు వచ్చింది. ఇదెలా జరిగిందో వారికి అర్థం కాలేదు. ఒక భయంకరమైన విష్‌ఫుల్ థింకింగ్‌లో ఉన్నవారు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కొన్ని జాతీయ చానెళ్లు నమ్మదగిన సర్వే రిపోర్టులు ఇచ్చాయి. ఇండియాటుడే, ఎన్‌డిటీవి లాంటివి వార్ వన్‌సైడ్ అని చెప్పేశాయి.
మళ్లీ ఇప్పుడు కూడా ఆ హడావుడి మొదలైంది. సరే.. తెలంగాణ విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. పాపం.. తగిలిన దెబ్బనుండి ఇంకా తేరుకోని కాంగ్రెస్‌కు లోక్‌సభ అభ్యర్థులే లేకపోయారు. అసెంబ్లీకి ఓడిపోయినవాళ్లను, గెలిచినవాళ్లనే మళ్లీ దింపాల్సిన గతి పట్టింది. చానెళ్లకు కూడా ఈ విషయం క్లియర్‌గా తెలుసు కాబట్టి, తెలంగాణపై వారికేమాత్రం ఆసక్తిలేదు. ఉన్నదంతా ఆంధ్రప్రదేశ్ పైనే.
దేశంలోనే అత్యంత సీనియర్ లీడర్, ఉన్న ముఖ్యమంత్రులందరికన్నా పెద్దవాడు, ప్రధానులను తయారుచేసే ఫ్యాక్టరీ ఉన్నవాడు, అన్నీ తానే కనిపెట్టినవాడు, తన అస్త్ర(రామోజీరావు), శస్త్రా(రాధాకృష్ణ)లతో ఒక పక్క…. తండ్రి అకాలమరణంతో అనుయాయూలను ఒక్కటిగా చేసేందుకు పార్టీ పెట్టి, ఆయన్నే ఆదర్శంగా తీసుకుని 3600 కి.మీలకు పైగా పాదయాత్ర చేసి, ముఖ్యమంత్రి అవినీతినే తన ఆయుధంగా మలచుకున్న యువకుడు ఇంకో పక్కా…
ఏం జరుగబోతోంది..?
ఒకప్పుడు మోదీకి అతిదగ్గరివాడిగా, ఆయనేంచెపితే తూ.చా తప్పకుండా పాటించే చంద్రబాబునాయుడుకి సడన్‌గా జ్ఞానోదయమైంది. అదీ ఇంకో ఆర్నెళ్లలో ఎలక్షన్లు వస్తున్నాయనగా. ప్రత్యేకహోదా ఇవ్వనందుకు మోదీ శత్రువుగా మారిపోయాడు. ప్రత్యేకహోదా ఏమైనా మంత్రదండమా.? అంతకంటే ఎక్కువగా డబ్బులొచ్చే ప్రత్యేక ప్యాకేజీలే బెటర్ అని తెలిసిన తండ్రి, తెలియని కొడుకు వేదికలెక్కి, మైకులు విరగ్గొట్టి మరీ బల్లలు గుద్దీగుద్దీ చెప్పారు. ఆంధ్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని అందరికీ తెలుసు… బాబుతో సహా. కానీ పోల్ మేనేజ్‌మెంట్ నాకు తెలినంతగా ఇండియాలో ఎవరికీ తెలియదని భావించే బాబు ఈసారి కూడా పవర్‌ను, పైకాన్నే నమ్ముకున్నాడు. డబ్బులు విరివిగా పంచితే ఓట్లు వాటంతట అవే పరిగెత్తుకొస్తాయనే ఆయన నమ్మకం, తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత కూడా సడలలేదు. గ్రేటే కదా.. సరే..ఆయన ‘అస్త్రశస్త్రాలు’ ఎలాగూ మళ్లీ అట్లాస్‌లాగా బాబును మోయకతప్పదు. ఎందుకంటే బాబు ఓడిపోతే..అన్న ఊహనే వాళ్లు భరించలేరు. ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. కాబట్టి తప్పదు. తెలంగాణలో జరిగిందే ఇక్కడా జరుగుతుందనే రూలేంలేదు కదా..అని ధైర్యం చెప్పుకుంటూ, వణుకుతున్న విష్‌ఫుల్ థింకింగ్‌తో బతుకుతున్నారు.
దీనికి పూర్తి వ్యతిరేకంగా జగన్‌మోహన్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. ఇది ఇప్పటి ప్రణాళిక కాదు. గత అయిదేళ్లుగా ప్రజలు అనుభవించిన బాధలనుండి, తాను ప్రత్యక్షంగా చూసిన, విన్న కడగండ్లనుంచి పుట్టింది. అసలు ప్రజలకేంకావాలి.? చంద్రబాబు ఎందుకివ్వడంలేదనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ రాష్ట్రమంతటా తిరిగాడు. పరిష్కారం దొరికింది. గమ్యం కనబడింది. స్వానుభవం, సాధికారత వచ్చేసాయి. తను తొలిరోజు నుంచి తారకమంత్రంలా జపిస్తున్న ప్రత్యేకహోదానే సకల సమస్యలకు సాదర పరిష్కారమని అర్థమైంది. ఇక అధికారం రావడమే తరువాయి. తెలంగాణ ముఖ్యమంత్రి విజయగాథను బాగా పరిశీలించాడు. అధికారంలో ఉంటే 24 గంటల్లో ఒక్కగంట ప్రజల గురించి ఆలోచించినా వాళ్ల జీవితాలు బాగుపడిపోతాయని తెలుసుకున్నాడు. వాళ్ల మనసులు గెలుచుకున్నాడు.
వీళ్లిద్దరి మధ్య పోటీలో గెలుపెవరిది.? ఈ ఆసక్తి సహజంగా ఆ రాష్ట్రవాసులకు, పక్కరాష్ట్రవాసులకు ఉంటుంది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరా అని. కానీ జాతీయచానెళ్లకు ఉన్న ఆసక్తి కాబోయే ప్రధానమంత్రి ఎవరా అని. అందులో భాగంగానే చంద్రబాబు మళ్లీ గెలుస్తాడా.. గెలిస్తే మద్దతు ఎవరికి? మోడీకా, రాహుల్‌కా.? లేదూ.. అమరావతిలో జగన్ గెలిస్తే, ఢిల్లీలో ఏం జరుగుతుంది.? ఈయన ఎవరికి వత్తాసు పలుకుతాడు.? ఇలా.. వారి సందేహాల పరంపర సాగుతూనేవుంది. అందులో భాగంగానే నెలకోసారి దక్షిణాది రాష్ట్రాల సర్వేలు చేస్తున్నారు. వారి అంచనాల ప్రకారమే సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి.
ఒక నాలుగు చానెళ్లు తమ సర్వే వివరాలను బయటపెట్టాయి. నెలలవారీగా చేసిన సర్వేలు, వాటి ఫలితాలు పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. ఇక్కడకూడా వార్ వన్‌సైడేనని తేల్చిచెప్పాయి. తెలుగుదేశం సోదిలో కూడా లేకుండా కొట్టుకుపోనుందని వారి నిశ్చితాభిప్రాయం. సరే..వారికి అసెంబ్లీతో పనిలేదు కాబట్టి, ఆ ఎన్నికల జోలికి పోలేదు. కానీ అదే అభిప్రాయంతో ఉన్న ఓటరు, అదేచేత్తో వేసే ఓటు ఎవరికేయనున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.
అధికారం, డబ్బుతో గెలుపు రాదు. సహనంతో కాలపరీక్షకు ఎదురేగితే విజయం తథ్యం. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సామెత కూడా కాలపరీక్షకు నిలబడింది. సాధారణంగా సామెతలు నిజమవుతాయి.
– రుద్ర ప్రతాప్