కాళేశ్వరం ప్రాజెక్టు ఎవడబ్బ సొత్తు అన్న జగన్.. ప్రారంభోత్సవానికి వెళ్తారా, లేదా..?

-

ఒకప్పుడు జగన్ అదే ప్రాజెక్టు విషయమై కేసీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసి.. ఇప్పుడు మళ్లీ అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆయ‌న‌ ఎలా వెళ్తారని కొందరు ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ కల అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును రాష్ర్టానికే వరప్రదాయినిగా భావిస్తుండగా.. మొత్తం 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగు నీటిని అందివ్వనున్నారు. అలాగే తొలి ఏడాది రోజుకు 2 టీఎంసీల చొప్పున, తరువాత ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీల నీరు చొప్పున ఎత్తిపోయనున్నారు. ఈ క్రమంలోనే ఏడాదికి 540 నుంచి 600 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. కాగా ఈ నెల 21వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. అలాగే అమరావతి వెళ్లి ఏపీ సీఎం జగన్‌ను కూడా కేసీఆర్ ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఈ నెల 17న అమరావతి వెళ్లనున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ కచ్చితంగా వెళ్తారనే సమాచారం అందుతుండగా.. ఇప్పుడు ఆ విషయం పట్ల కొందరు జగన్‌ను విమర్శిస్తున్నారు. ఒకప్పుడు జగన్ అదే ప్రాజెక్టు విషయమై కేసీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసి.. ఇప్పుడు మళ్లీ అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆయ‌న‌ ఎలా వెళ్తారని కొందరు ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. అప్పట్లో జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు, సీఎం కేసీఆర్‌లపై చేసిన వ్యాఖ్యల వీడియోను ఇప్పుడు పలువురు సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు.

2016లో కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపనకు వ్యతిరేకంగా జగన్ 3 రోజుల పాటు కర్నూలులో దీక్ష చేపట్టారు. 2016 మే 2వ తేదీన సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేయగా, అదే ఏడాది మే 16, 17, 18 తేదీల్లో జగన్ కర్నూలులో జలదీక్ష పేరిట 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. అందులో భాగంగా జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. ”తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ఏపీ, తెలంగాణలు.. ఇండియా, పాకిస్థాన్ అయిపోతాయన్నారు. తాగేందుకు నీళ్లు లేకపోతే ఎలా బతకాలన్నారు. భూపాలపల్లి థర్మల్ ప్రాజెక్ట్‌తో కలిపి గోదావరి జలాల ట్రిబ్యునల్ గతంలో ఏపీకి 1480 టీఎంసీలను కేటాయించగా, అందులో 954 టీఎంసీల నీటిని తాము తీసుకుని, ఏపీకి 530 టీఎంసీల నీటిని ఇస్తానని కేసీఆర్ అనడం సమంజసం కాదని అన్నారు. కేసీఆర్.. అది ఎవడబ్బ సొత్తు.. అని జగన్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తనకు ఇష్టం వచ్చినట్లుగా ప్రాజెక్టులు కడుతున్నారని, వాటికి అనుగుణంగా లెక్కలు కడుతున్న కేసీఆర్ తీరు సరైందేనా అని జగన్ అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో ఎవరి వాటా ఎంత అనే విషయం తేలలేదని, అలాంటప్పుడు ఎగువలో ఉన్నాం కదా అని మీరు ప్రాజెక్టులు కట్టుకుని మీ నీటి అవసరం తీరాక మాకు నీళ్లను పంపిస్తామనడం.. సరికాదన్నారు. కేసీఆర్ ఈ విషయంలో హిట్లర్‌లా మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. కేసీఆర్, చంద్రబాబు నాయుడులకు జ్ఞానోదయం కావాలని తాను కోరుకుంటున్నా”నని జగన్ అన్నారు.

అయితే జగన్ అప్పట్లో చేసిన ఆ వ్యాఖ్యలకు చెందిన ఆ వీడియోలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తారా, లేదా అన్న విషయం సందిగ్ధంగా మారింది. అయితే ఒక వేళ జగన్ గనక ఆ కార్యక్రమానికి వెళితే.. అదే వీడియోను, జగన్ చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి అటు టీడీపీ నాయకులు జగన్‌పై వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పై వీడియోతో సోషల్ మీడియాలో జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ అభిమానులు క్యాంపెయన్ ప్రారంభించారు. ఇక జగన్ నిజంగానే ఆ కార్యక్రమానికి వెళితే వారికి ఒక మంచి ఊతం దొరికినట్లు అవుతుంది. మరి ఈ విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేస్తారా ? తొందరపడతారా ? అన్న విషయం తేలాలంటే ఈ నెల 21వ తేదీ వరకు వేచి చూడక తప్పదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version