ఆయన రూటే సెపరేటు! అధికారంతో పనిలేదు. నోటి దూల స్టయిలేవేరు.. ఆయనకు ఎవరైనా లెక్కలేదు ..!! ఇలా విర్రవీగిపోయిన ఏకైక నాయకుడిగా పశ్చిమ గోదావరి పరువును గోదావరిలో కలిపేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. వాస్తవానికి ఈ జిల్లా నుంచి అనేక మంది నాయకులు తమదైన శైలిలో రాజకీయాలు చేశారు. ప్రజలకు చేరువైన వారు ఉన్నారు. ప్రజలకు చేరువయ్యామని చెబుతూనే.. ఎలాంటి వివాదలూ లేకుండా వెనుకేసుకున్న నాయకులు కూడా ఉన్నారు. అలాంటి జిల్లా నుంచి వచ్చిన చింతమనేని ప్రభాకర్.. తొలిసారి 2009లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సోంతం చేసుకున్నారు.
అప్పట్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో చింతమనేని ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అయితే, ఆయన దూకుడు మాత్రం తగ్గలేదు. తాను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కానని, తన పార్టీ అధికారంలో కూడా లేదని కూడా తెలిసినా.. ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దెందులూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అయితే, అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్ మీదే కలబడినంత పనిచేశారు. ఆ సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తర్వాత కాలంలో టీడీపీ అధికారంలోకి రావడం.. చింతమనేని కూడా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో.. ఇక ఆయనకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. చింతమనేని చేయని పనులంటూ లేవనే చెప్పాలి.
అధికారులపైనా, గిట్టనివారిపైనా దాడులు చేయడం, వారిపై నోరు పారేసుకోవడం వంటి ఘటనలు షరా మామూలయ్యాయి. సంపాదన కోసం చింతమనేని తొక్కని అడ్డదారులంటూ లేవని రాజకీయవర్గాల్లో జోరుగానే ప్రచారం సాగింది. ముఖ్యంగా మహిళా తహశీల్దార్ వనజాక్షిని దూషించడం, కొట్టడం వంటివి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు వేదికగా మారాయి. “మీకెందుకురా అధికారం“- అంటూ ఆయన దళితులను దూషించిన విషయం కూడా రాష్ట్రంలో సంచలనంగా మారింది. అటువంటి చింతమనేని ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీనికితోడు తెలుగుదేశం పార్టీ కూడా అధికారానికి దూరమైంది. దీంతో చింతమనేనికి చుక్కలు కనిపించడం ప్రారంభమైంది.
ఎన్ని రకాలుగా ఆయనను తొక్కాలో అన్ని రకాలుగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆయనను తొక్కడాని కి ప్రయత్నాలు షురూ చేసింది. నిన్న మొన్నటి వరకు టీడీపీ అధికారాన్ని చూసుకుని తనకు తిరుగులేద ని భావించిన చింతమనేని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఆయనపై 62 కేసులు నమోదైనట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆయనకు ప్రస్తుత కేసులో బెయిల్ వచ్చినా. కొత్తగా మరో కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. టీడీపీ నుంచి కూడా ఆయనకు మద్దతుగా ఎవరూ ముందుకు రాకపోవడమే! అంటే చింతమనేని బాధితుల్లో టీడీపీ నేతలు కూడా ఉండడం ఇప్పుడు ఆ పార్టీకే మింగుడుపడని వ్యవహారంగా మారిపోయింది.