గ్రామీణ విద్యార్థులకు కేంద్రం కంప్యూటర్‌ కోర్సులు!

-

– వరంగల్‌, కరీంనగర్‌, సంగారెడ్డి, ఖమ్మంలలో ఏర్పాటుకు సన్నాహాలు
– రూ. 300 కోట్లతో కేంద్రం ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం

సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగాలను నడిపిస్తున్న ఆధునిక సాంకేతిక వ్యవస్థలను గ్రామీణ విద్యార్థులకు అందించడానికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఆర్టిఫిషియన్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌.. ప్రాసెస్‌ ఆటోమేషన్‌..క్యాడ్‌, క్యామ్‌, సీఎన్‌సీ, 3డీ ప్రింటింగ్‌, గ్లాస్‌ మెషినింగ్‌, ఫోర్జింగ్‌, వాక్యూమ్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌.. వీటికి సంబంధించిన కోర్సులను అభ్యసించే అవకాశం త్వరలో తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు రానుంది.

ఈ కోర్సులను పదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు ఏ స్థాయి అభ్యర్థులైనా వీటిలో చేరవచ్చు.

ఐటీ, వాటి ఆధారిత సంస్థలు, భారీ, చిన్నతరహా పరిశ్రమలలో ఉద్యోగాలు పొందవచ్చు. లేదంటే సొంతంగా పరిశ్రమలను స్థాపించుకోవచ్చు. తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, సంగారెడ్డి, ఖమ్మంలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాంకేతిక కేంద్రాలు (టెక్నాలజీ సెంటర్స్‌), విస్తరణ కేంద్రాలు (ఎక్స్‌టెన్షన్‌ సెంటర్స్‌) ఏర్పాటు చేయనుంది. విద్యార్థులకు అధునిక పరిజ్ఞానం అందించి.. వారిని ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి సాధన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వీటి ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూములు, మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. భవన నిర్మాణాలు, సంస్థల నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి సాంకేతిక కేంద్రాలు 18 ఉన్నాయి. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) వాటిలో ఒకటి.

ఏయే కోర్సులు నేర్చుకోవచ్చు?

సర్టిఫికెట్‌, డిప్లోమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, పోస్టు డిప్లొమా, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ వంటి కోర్సులు ఉంటాయి. సంవత్సరం, రెండు, మూడు, నాలుగు సంవత్సరాల కోర్సులతో పాటు మూడు నెలలు, ఆరు నెలల కోర్సులు సైతం ఉంటాయి. అఖిల భారత స్థాయిలో పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్లేస్‌మెంట్స్‌ కూడా బాగా ఉంటాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news