దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2023 సెషన్-2 ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ ఇవాళ ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జనవరిలో జరగ్గా.. ఏప్రిల్ 6 నుంచి 15వరకు రెండో విడత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షను 8.24 లక్షల మంది విద్యార్థులు రాయగా.. రెండో విడత పరీక్షను దాదాపు 9లక్షల మంది వరకు హాజరైనట్టు అంచనా.