దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోడా ప్రకటించారు. దీనికి సంబంధించి జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అలాగే జనవరి 14 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అదే నెల 21తో గడువు ముగుస్తుందని వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జనవరి 28. ఇక ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తారు.
ఢిల్లీలో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సునీల్ అరోడా తెలిపారు. ఢిల్లీలో మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 22తో ప్రస్తుత అసెంబ్లీ గడవు ముగియనుంది. ఢిల్లీలో 13,767 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సునీల్ అరోడా తెలిపారు. ఎన్నికల కోసం 90వేల మంది పోలిస్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు.