టీవీలు, థియేటర్లే కాదు.. ఆ తరహా మాధ్యమం ఏదైనా సరే.. అవి జనాలకు చక్కని వినోదాన్ని ఇవ్వాలి. నిత్యం అనేక రకాల ఒత్తిళ్లతో సతమతమయ్యే సగటు ప్రేక్షకులు.. టీవీ సీరియల్ లేదా సినిమా లేదా ఏ ఇతర షో అయినా చూస్తే.. మనస్సుకు ప్రశాంతత ఇవ్వాలి.
చెప్పేవాడికి వినేవాడు లోకువ.. అయినట్లు.. జనాలను వెర్రివాళ్లను చేయడంలో సమాజంలోని పలు మాధ్యమాలు ఆరితేరాయి. వాటిల్లో ముఖ్యంగా టీవీ సీరియల్స్ ఒకటి. వాటి ద్వారా టీవీ చానల్స్ ప్రేక్షకులను పిచ్చి వెధవలను చేస్తుంటాయి. అర్థం పర్థం లేని డైలాగులు, నటీనటుల ఓవరాక్షన్, ఎందుకు చెబుతున్నారో, ఏం చెబుతున్నారో తెలియని పిచ్చి కథ.. వెరసి..టీవీ సీరియల్స్ అనేవి.. అసలు సిసలైన వీక్షకుడి పరిధిని ఎప్పుడో దాటేశాయి. వాటిని చూస్తే ఎక్కడ లేని కంపరం, జుగుప్స.. అన్నీ కలుగుతాయి. అయితే ఇప్పుడదేలాంటి భావం బిగ్‌బాస్ షోను చూస్తే కలుగుతోంది.. నిజ్జంగా.. ఇది నిజమే..!
టీవీలు, థియేటర్లే కాదు.. ఆ తరహా మాధ్యమం ఏదైనా సరే.. అవి జనాలకు చక్కని వినోదాన్ని ఇవ్వాలి. నిత్యం అనేక రకాల ఒత్తిళ్లతో సతమతమయ్యే సగటు ప్రేక్షకులు.. టీవీ సీరియల్ లేదా సినిమా లేదా ఏ ఇతర షో అయినా చూస్తే.. మనస్సుకు ప్రశాంతత ఇవ్వాలి. నలుగురితోనూ కలిసి ఆ షో లేదా మూవీకి చెందిన ముచ్చట్లను చెప్పుకుని మరింత మనశ్శాంతి పొందాలి. సరైన వినోదాన్ని ఫీలవ్వాలి. కానీ అలా కాకుండా అర్థం పర్థం లేకుండా షోలను కొనసాగిస్తూ, జనాలలో మరింత ఒత్తిడిని పెంచుతూ.. ఆందోళన కలిగిస్తూ.. అసలు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారు. దీంతో టీవీ చూడాలంటేనే కంపరం పుడుతోంది.
అసలు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సీరియల్స్, షోలు ఎప్పుడో అంతరించిపోయాయి. ఎప్పుడో ఒక షో అలా వచ్చి ఇలా వెళ్లిపోతోంది తప్ప.. వీక్షకుడి కోణంలో సీరియల్స్, షోలు తీసే వారు కరువయ్యారు. ముఖ్యంగా బిగ్‌బాస్ షో విషయానికి వస్తే.. ఆ షోను అసలు ఎందుకు నిర్వహిస్తున్నారో.. నిర్వాహకులకే అర్థం కావడం లేదు. ఓ వైపు హౌస్‌లో పనికిమాలిన టాస్క్‌లు పెడుతూ.. కంటెస్టెంట్ల ఏడుపులు, పెడ బొబ్బలను చూపిస్తూ.. మరో వైపు ఆ సభ్యులను సేవ్ చేయాలంటే ఓట్లు వేయాలని అడుగుతున్నారు. అయితే ఓట్లు కోరడం వరకు బాగానే ఉంది.. కానీ వారాంతం వచ్చే సరికి ఆ ఓట్లకు ప్రాధాన్యత లేకుండా నిర్వాహకులు తమ ఇష్టం వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తున్నారు. గతంలో ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులను ఒక్కసారి పరిశీలిస్తే మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంతోటి సినిమాకు వాల్ పోస్టర్ ఎందుకన్న చందంగా.. వీక్షకుల ఓట్లకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతే.. వారిని ఓట్లను వేయమని అడగడం దేనికి..? ఇది జనాలను వెర్రి గొర్రెలను చేయడం కాదా..? ఈ విషయంపై ఆ షో నిర్వాహకులే ఒక్కసారి ప్రశ్నించుకోవాలి.
సినిమాలైనా, టీవీ షోలు, సీరియల్స్ అయినా.. అవి జనాలకు మెసేజ్‌లు ఇవ్వాల్సిన పనిలేదు. వారు కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దాన్ని అవి అందిస్తే చాలు. అలా కాకుండా ఎంత సేపూ తలాతోకా లేని స్క్రిప్ట్‌తో షోలను నడిపిస్తూ.. ప్రేక్షకులకు అవంటే పరమ బోర్ కొట్టించేలా చేస్తున్నారు. ఇంతోటి దానికి అంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి షోలను నిర్వహించడం దేనికి ? అన్న మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే మన దేశంలో జనాలు చూసే టీవీ చానల్స్‌లో.. ఆయా షోలు, సీరియల్స్‌ను తీసేవారికి నిజంగా సగటు ప్రేక్షకుడంటే ఇసుమంతైనా విలువ ఉందా..? అంటే.. అది మిలియన్ డాలర్ల ప్రశ్నే అవుతుంది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే ప్రోగ్రామ్స్‌పై కాకుండా.. ఏదో ఒక షో చేద్దాం.. డబ్బులు వస్తే చాలు కదా.. అన్న ధోరణి చాలా మంది నిర్మాతల్లో పెరిగిపోయింది. అందుకనే క్వాలిటీ ఉన్న ప్రోగ్రామ్స్ రావడం లేదనే విమర్శలూ ఉన్నాయి. కానీ విదేశాల్లో మాత్రం ఇలా కాదు. అక్కడ నిర్మాతలు, దర్శకులు వీక్షకుడి కోణం నుంచే ఎక్కువ ఆలోచిస్తారు. అందుకనే ఆయా షోలు ఇక్కడి షోలకు ప్రేరణగా నిలుస్తుంటాయి. మరి ఇక ముందైనా.. సీరియల్స్, రియాలిటీ షోల నిర్వాహకులు కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహిస్తారా..? లేక అదే మూస ధోరణిలో ముందుకు వెళ్తారా..? అన్నది.. వేచి చూస్తే తెలుస్తుంది..!