హుజూర్ నగర్ ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యవహారంతో పార్టీ పరువు బజారున పడుతోంది. నాయకుల ఆధిపత్య పోరుతో పార్టీ క్యాడర్ లోనూ గందరగోళం నెలకొంది. అసలే కొన ఊపిరితో కొట్టుమిట్టాతున్న పార్టీ పరిస్థితి నాయకుల తీరుతో మరింత దయనీయంగా మారింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే పార్టీలో నెలకొన్న ఇంటిపోరును తలుచుకుని నాయకులు, క్యాడర్ బెంబేలెత్తుతోంది.
హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనుంది. 24న ఫలితాలను ప్రకటించ నున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. షెడ్యూల్ విడులైన వెంటనే టీఆర్ ఎస్ తన పార్టీ అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పద్మావతి అభ్యర్థిత్వాన్ని ఆపార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మొన్న ఎన్నికల్లో కోదాడలో ఓడిపోయిన పద్మావతికి టిక్కెట్ ఎలా ? ఇస్తారని రేవంత్ ఫైర్ అవుతున్నారు. అంతేగాక తన అనుచరుడు కిరణ్‌రెడ్డికే టికెట్ ఇవ్వాలని రేవంత్ హైకమాండ్ వద్ద పట్టుబడున్నారు. టికెట్ ఇవ్వని పక్షంలో రెబల్‌గా పోటీకి దించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అభ్యర్థిగా కిరణ్‌రెడ్డిని ప్రకటించిన రేవంత్.. తన మద్దతుదారుడి కోసం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నట్లు సమాచారం.
దీంతో పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ రాజీ ఫార్ములాను ప్రయోగించేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇక నల్లగొండ జిల్లాకు చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి తదితరుల మధ్య నిన్నమొన్నటి వరకు గ్యాప్ ఉన్నా ఇప్పుడు వీరు ఒక్కటయ్యారు. నల్లగొండ జిల్లాలో పక్క జిల్లా నేతల పెత్తనం అక్కర్లేదని చెప్పారు. ఏదేమైనా అసలు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా టీ కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. అయితే నాయకుల కుమ్ములాటలతో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయే పరిస్థితి దాపురించిందని కాంగ్రెస్ నాయకులు, పార్టీ క్యాడర్ మదనపడుతున్నారు.