తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించిన రియాల్టీ షో బిగ్‌బాస్ 3. ఈ రియాల్టీ షో స్టార్ మా టీవీలో విజయవంతంగా 105 రోజులు కొనసాగి, ఈనెల 3న గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేసిన ఈ రియాల్టీ షో ప్రారంభం నుంచి గ్రాండ్ ఫినాలే వరకు ఎంతో ఉత్కంఠ నడుమ, ఆసక్తికరంగా సాగింది. మొత్తం 17మంది కంటెస్ట్‌లు బిగ్‌బాస్ హౌస్‌లోకి జూలై 21న గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ 3 రియాల్టీ షో కళాకారులు, జర్నలిస్టులు, యాంకర్లు, సిని నటులతో కళకళలాడింది. వారం వారం బిగ్‌బాస్ షో కోసం తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా నాగార్జున తన మాటల చాతుర్యంతో మంత్రముగ్ధులను చేశారు.
అయితే బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలేకు ఐదుగురు బలమైన కంటెస్ట్‌లు చేరుకున్నారు. ఇందులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ శ్రీముఖి, నటుడు వరుణ్ సందేశ్, పాపులర్ డ్యాన్స్ మాస్టర్ బాబా బాస్కర్, టీవీ నటుడు అలీ రెజా గ్రాండ్ ఫినాలే బరిలో నిలిచారు. అయితే బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలే చివరి రోజైన ఆదివారం ఐదుగురు కంటెస్టెంట్స్‌లో వరుణ్‌సందేశ్, అలీరేజా, బాబా భాస్కర్ ఎలిమినేషన్ అయ్యారు. చివరిగా రాహుల్, శ్రీముఖి ఫైనల్ కు చేరుకుని ట్రోపీ కోసం గట్టిగానే పోటీ పడ్డారు. ఇందులో చివరికి బిగ్‌బాస్ 3 విజేతగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలువగా, రన్నరర్‌గా యాంకర్ శ్రీముఖి నిలిచారు.
బిగ్‌బాస్ 3 రన్నరర్‌గా నిలిచిన శ్రీముఖి 1993 మే 10న నిజమాబాద్‌కు చెందిన రామకృష్ణ, లత దంపతులకు జన్మించింది. తెలుగులో అదుర్స్ టీవీ రియాల్టీ షోతో తన యాంకరింగ్ కేరీర్‌ను ప్రారంభించింది శ్రీముఖీ. తన మాటల మాయతో అనతి కాలంలోనే టాప్ యాంకర్‌గా పేరు సంపాదించిన శ్రీముఖీకి సినిమాల్లోనూ అవకాశం వచ్చింది. 2012లో స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన జులాయ్ సినిమాలో హీరోకు చెల్లెగా నటించింది. ఇక తన నటన ప్రతిభతో వరుసగా సినిమాల్లో అవకాశాలు సంపాదించి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, ఎట్టుతిక్కం మదయానాయ్ (తమిళం), చంద్రిక, ధనలక్ష్మి తలుపు తడితే, ఆంధ్రాపోరీ, నేను శైలజ, సావిత్రి, జెంటిల్‌మెన్, మనలో ఒక్కడు, బాబూ బాగా బిజీ అనే సినిమాల్లో నటించింది. టీవీలో ఆదుర్స్ 1, 2, మనీ మనీ, సూపర్ సింగర్ 9, భలే ఛాన్స్‌లే, సూపర్ మామ్, సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్, పటాస్, జీ సరిగమప షోలకు యాంకర్‌గా పనిచేసింది శ్రీముఖి. తన నటన, యాంకరింగ్‌తో బిగ్‌బాస్ 3 కి ఎంపిక అయింది.
యాంకర్ శ్రీముఖి మొదటి నుంచి బిగ్‌బాస్ 3 విన్నర్ అనే ప్రచారం జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన నాటి నుంచే శ్రీముఖి తన దూకుడు తనం, యాంకరింగ్‌లో ఉన్న అనుభవంతో మాటలతోనే అందరిని కట్టి పడేసింది. తనకు ఏ టాస్క్ ఇచ్చినా వాటిని అంతే సమర్థవంతంగా పూర్తి చేసి అందరి చేత శభాష్ అనిపించుకునేంది. అయితే ఒక్కొక్కసారి శ్రీముఖి వ్యవహారశైలీ అతిగా ఉండటం, బిగ్‌బాస్‌నే డామినేట్ చేసేలా ఉందని హోస్ట్ నాగార్జున చేత చివాట్లు తిన్నారు. ఒక సందర్భంలో ఎలిమినేషన్‌లోకి వెళ్ళింది. కానీ ప్రేక్షకులు శ్రీముఖికి అండగా ఉండటంతో బతికిపోయింది.
అయితే శ్రీముఖి చేసిన తన తప్పిదాలను క్రమక్రమంగా తగ్గించుకుని బిగ్‌బాస్ 3 టైటిల్ రేస్‌లోకి వచ్చి అందరికి జోష్‌ను నింపారు. గత రెండు బిగ్‌బాస్ సీజన్లలో విన్నర్లుగా పురుషులే నిలవడంతో ఈసారి మహిళలను విజేతగా చేయాలని అనేక డిబెట్లు జరిగాయంటే శ్రీముఖి ఎంతగా ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. అయితే ఎట్టకేలకు గ్రాండ్ ఫినాలేలో విన్నర్ రాహుల్ కు గట్టి పోటీ ఇచ్చింది. చివరి దశలో విజేతగా నిలుస్తుందనే ప్రేక్షకులు అనుకున్నారు. అయితే చివరకు వచ్చే సరికి రాహుల్ క్రమక్రమంగా బలపడితే అదే టైంలో శ్రీముఖి బలహీనపడింది. చివరకు బిగ్‌బాస్ 3 విజేతగా రాహుల్ నిలవడంతో రన్నరర్‌గా నిలిచింది శ్రీముఖి.