దేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఇప్పటికీ ప్రోత్సాహకరంగా లేకపోవటంతో బడ్జెట్లో ప్రభుత్వం మూలధన పెట్టుబడులను మరింతగా పెంచటంపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వృద్ధిని ఉత్తేజితం చేయడం కోసం మౌలిక వసతులపైనే అధికంగా దృష్టి పెట్టే వీలుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.. ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదించనున్నారు.
కొవిడ్-19 తర్వాత ప్రభుత్వం క్యాపెక్స్‌కే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా ఆర్థిక రంగం నిద్రాణ స్థితి నుంచి మేల్కొని పరుగులు తీయడం ప్రారంభించింది. ఫలితంగా గత మూడేళ్ల కాలంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటిలో ఇదే అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మూలధన పెట్టుబడులకు రూ.10 లక్షల కోట్లు కేటాయించింది. 2020-21లో ఇది రూ.4.39 లక్షల కోట్లు కాగా 2022-23లో 35 శాతం పెంచి రూ.7.5 లక్షల కోట్లు కేటాయించారు. 2023-24 బడ్జెట్లో ఇది 37.4 శాతం పెరిగింది. ఆ రకంగా చూసినట్టయితే రాబోయే బడ్జెట్లో కూడా భారీ మొత్తంలో నిధులు ఇందుకు కేటాయించే ఆస్కారం ఉందని అంచెనా వేయవచ్చు.