ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోసే నాన్న గొప్పదనం తెలుసుకుంటే కన్నీరు ఆగదు.. !

-

నాన్న అనే పదంలోని అక్షరాలు రెండే.. కానీ దీని లోతు అనంతమైనది.. ఎందుకంటే ఇదొక మధురమైన పిలుపు.. ఈ పిలుపు కేవలం మనుషులకే సొంతం.. ఇకపోతే కనిపించిన ప్రతి మహిళను అమ్మా అని పిలిచే అవకాశం ఉంది.. కానీ కంటి ముందున్న ప్రతి మగవాన్ని నాన్నా అని పిలువలేము కదా.. ఇలాంటి నాన్నా నేటికాలంలో డబ్బులు సంపాదించే యంత్రంలా అయ్యాడు.. ఇళ్లు అనే వాహనాన్ని నడిపే డ్రైవర్‌లా మారాడు.. ఇంత చేసినా అతనిలో విసుగు కనిపించదు.. ఎందుకంటే తనపిల్లలు పెరిగి పెద్దవారు అయ్యి ప్రయోజకులు అవ్వాలనే ఆశ.. ఇందుకోసం ఎంత కష్టాన్నైనా, ఎన్ని అవమానాలు అయినా భరిస్తాడు..

ఇకపోతే అమ్మది కన్న పేగు ప్రేమ అయితే, నాన్నది కను రెప్ప రక్ష.. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం ప్రపంచాన్ని చూపే బడిలాంటిది.. తల్లి జోల పాట ఎలాగో, నాన్న నీతి పాఠం కూడా అలాగే.. కాలం అనే బాట మీద కనిపించని గొప్ప సాధకుడు నాన్న.. ఈరోజు నువ్వు ప్రపంచం దృష్టిలో గొప్పవాడివి కావచ్చూ కానీ దీనికి పునాది వేసింది మాత్రం నాన్నే.. ఎందుకంటే నాన్నా అనేది ఒక నమ్మకం.. ఆ నమ్మకం వేలుపట్టుకునే నువ్వు అడుగులు మొదలుపెట్టింది.. ఇక అమ్మ ఆత్మీయతకు ప్రతిబింబమైతే.. అంతులేని వాత్సల్యానికి నాన్న ఓ ప్రతిరూపం. పిల్లల్లో ధైర్యాన్ని నింపి, వారు దర్జాగా బతికేందుకు అనుక్షణం ఆసరా ఇచ్చే బలం నాన్న.. క్లుప్తంగా చెప్పాలంటే నాన్న అంటే దశ దిశ చూపే మార్గదర్శి..

చిన్నప్పుడు నాన్నా గాల్లోకి ఎగిరేసి అందుకుంటుంటే కిల కిల నవ్వుతావు.. ఎందుకో తెలుసా నాన్న నన్ను పడిపోకుండా పట్టుకుంటాడు అనే నమ్మకం.. కానీ యవ్వనంలోకి అడుగుపెట్టిన నీకు నాన్న చేష్టలు చాదస్తంలా కనిపిస్తాయి.. ఎందుకని ఒక్క సారి ఆలోచించావా.. కానీ ఎప్పటికి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మ వెలుగుతున్న జ్యోతి అయితే ఆ జ్యోతికి చమురే నాన్నా.. అమ్మ ప్రేమ అందరికి కనిపిస్తుంది.. కానీ నాన్న మనోవేదన ఒక అతని మనసుకు మాత్రమే తెలుస్తుంది.. నువ్వు ఛీ అన్నా ఛీదరించుకున్న నీ నీడలా నీవెంటే ఉంటాడు.. తానూ చీకట్లో ఉన్నా తన పిల్లలను వెలుగువైపు నడిపిస్తాడు..

లోకంలో అమ్మ గురించి మాట్లాడినంతగా నాన్న కోసం చర్చించలేరు.. ఎందుకో తెలుసా.. తానెప్పుడు పిల్లల ఎదుగుదలనే ఆశిస్తాడు గానీ తాను ఎంతగా ఒదిగిపోతున్నాడో, నలిగిపోతున్నాడో గ్రహించడు అందువల్ల ఎప్పుడు వెనకబడే ఉంటాడు.. అయినా గాని ఫీలవడు.. అదే తండ్రి గొప్పదనం.. ఒకప్పుడు పిల్లలంతా తండ్రి మాటను జవదాటని వారే! కానీ నేటికాలంలో తమకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా వ్యతిరేకించడానికి పిల్లలు ఏమాత్రం సందేహించడం లేదు. అందువల్ల నాన్నా అంటే నాలుగడుగుల వెనకే ఉండిపోతున్నాడు.. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి.. ఒక ఫాదర్స్ డే నాడే మీకు తండ్రి గుర్తుకు వచ్చేలా మాత్రం ఉండకండి.. ఎందుకంటే ఆ పిలుపు చేయి జారిపోతే దక్కించుకోవడం చాల కష్టం.. అతను మీ కళ్ల ముందు ఉన్న ప్రతిక్షణాన్ని మనస్పూర్తిగా ఆస్వాధించండి.. మన కోసం అనుక్షణం తపిస్తూ తనకోసం కాకుండా తన పిల్లల కోసం ఓ యంత్రంలా.. అన్నీ తన పిల్లలకు కావాలనుకునే స్వార్థపరుడు నాన్న..

Read more RELATED
Recommended to you

Latest news