వైకుంఠద్వారా దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి.. అందుకు తగినట్టు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. తిరుపతి జరిగిన తొక్కిసలాట ఘటన పై డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి కలెక్టర్, ఎస్పీలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసారు.
ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమైన అధికారులపై తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలని ఆదేశించారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలోనే ఇలాంటి విచారకరమైన ఘటన చోటు చేసుకోవడం తీవ్రంగా బాధించిందన్నారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు ఇవాళ చంద్రబాబు తిరుపతికి రానున్నారు. తిరుపతి జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.