ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌: డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ పోరాట స్పూర్తి..!

-

స్వాతంత్ర్య ఉద్యమం అనేది ఒక మతానికో, కులానికో పరిమితం కాలేదు. కొందరు నాయకత్వం వహించిన ఉద్యమం కాదు.. కుల, మత , లింగభేదాలు లేకుండా ఎంతో మంది వీరోచిత పోరాటం చేశారు. ఎన్నో వేల మంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పాయారు. ఏంతో మంది ఏకమైన ఈ గడ్డమీద నుంచి విదేశీయులున్ని తరిమికొట్టడమే అంతమి ఆశగా పోరాటం చేశారు. స్వాతంత్యం వచ్చి ఏడు దశాబ్దాలకు పైగా దాటినా ఆనాటి ధైర్యసాహసాలు, నిస్వార్థం, దృఢ సంకల్పం మనకు ఇంకా స్ఫూర్తినిస్తూ మనం గర్వించేలా చేస్తున్నాయి. వారి ప్రగాఢ వాంఛ దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేసింది. వారి త్యాగాలు, వారు పడిన కష్టనష్టాలు మాటల్లో చెప్పడం అసాధ్యం. సర్వస్వం ధారబోసి 1947లో స్వాతంత్య్రం తెచ్చిపెట్టినందుకు భారతదేశం వారికి సదా రుణపడి ఉంటుంది. వారిలో ఒకరైన పండితుడు డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.
ఒక సందర్భంలో ఉపాధ్యాయుడు ఒకరు ఓ విద్యార్థి సమాధాన పత్రాన్ని పరిశీలిస్తూ “పరిశీలకుడికన్నా పరిశీలింపబడే విద్యార్ధి మెరుగ్గా ఉన్నాడు” అని వ్యాఖ్యానించాడు. ఆ విద్యార్థి మరెవరో కాదు… విద్యాభ్యాస సమయంలో సదా తెలివైన విద్యార్ధిగా ప్రశంసలు అందుకున్న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆ రోజుల్లో ఇంట్లో లేదా పాఠశాలలో రాజేంద్రబాబులా చదువుకోవాలనే మాట వినని బీహార్ విద్యార్ధి లేడు..
ఆయనకు గల పదునైన మేధస్సు గురించి ఆ కాలానికి చెందినవారు ఘంటాపథంగా చెబుతారు. ఆయన ఎలాంటి దినచర్య పుస్తకం (డైరీ)తో నిమిత్తం లేకుండానే తన 1,900 పేజీల జీవిత చరిత్రను రాశారు. ఆయా సంఘటనలు కేవలం ముందు రోజు జరిగినవే అనిపించే రీతిలో ఆయన తన జీవిత చరిత్రలోని అధ్యాయాలను పేర్చుకుంటూ వచ్చారు.
బీహార్ రాష్ట్రం ఛాప్రా జిల్లాలోని జిడీ అనే ఓ చిన్న గ్రామంలో 1884 డిసెంబరు 3న రాజేంద్ర ప్రసాద్‌ జన్మనించారు. విద్యాభ్యాసం అనంతరం న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. అయితే, గోపాలకృష్ణ గోఖలే ఆలోచనలు రాజేంద్ర ప్రసాద్‌ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామి అయ్యారు.
ఉప్పు సత్యాగ్రహంతో మొదలు..
మహాత్మాగాంధీ “ఉప్పు సత్యాగ్రహం” ప్రారంభించినప్పుడు అనేక మంది సత్యాగ్రహులతోపాటు రాజేంద్ర ప్రసాద్ కూడా అందులో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత.. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలోనూ భాగస్వామి అయ్యారు. బీహార్‌లో (ముఖ్యంగా పాట్నా) నిరసనలు, ప్రదర్శనలకు నాయకత్వం వహించాడు. స్వాతంత్ర్యం కోరుతూ దేశవ్యాప్త ఆందోళనలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రభావవంతమైన కాంగ్రెస్ నాయకులందరినీ సామూహిక అరెస్టు చేయడానికి ప్రేరేపించాయి. డా. ప్రసాద్‌ను పాట్నాలోని సదాఖత్ ఆశ్రమం నుంచి అరెస్టు చేసి బంకీపూర్ సెంట్రల్ జైలుకు పంపారు, అక్కడ అతను 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. 15 జూన్ 1945న విడుదలయ్యాడు.
ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు డాక్టర్ ప్రసాద్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు.1914లో బెంగాల్, బీహార్‌ను ప్రభావితం చేసిన గొప్ప వరదల సమయంలో సహాయక చర్యల కోసం తన సేవలను స్వచ్ఛందంగా అందించాడు. బాధితులకు స్వయంగా ఆహారం, బట్టలు పంపిణీ చేశాడు. 1934 జనవరి 15న బీహార్‌లో భూకంపం సంభవించినప్పుడు రాజేంద్రప్రసాద్ జైలులో ఉన్నారు. రెండు రోజుల తర్వాత విడుదలయ్యాడు. జనవరి 17న బీహార్ సెంట్రల్ రిలీఫ్ కమిటీని ఏర్పాటు చేశాడు. సహాయ నిధుల సేకరణను పర్యవేక్షించాడు. రూ. 38 లక్షలకు పైగా వసూలు చేశాడు.
1947లో దేశానికి స్వాతంత్యం వచ్చినప్పుడు భారతదేశానికి రాజ్యాంగం రూపొందించేందుకు, ఉద్దేశించిన రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడు దానికి రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ విధంగా రూపొందిన రాజ్యాంగానికి ఆమోదం అనంతరం భారత రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతిగా 1950 జనవరి 26 నుంచి 1962 మే 14 వరకూ. కొనసాగారు. వరుసగా రెండు పర్యాయాలు పదవిలో కొనసాగిన వ్యక్తి ఆయన ఒక్కరే. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాజేంద్రప్రసాద్ 1951 మే 11న సోమనాథ్ ఆలయ పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, అప్పటికీ అనేకసార్లు దాడులకు గురైన సోమనాథ్ ఆలయాన్ని ఆ తర్వాత పునర్నిర్మించారు. ఆయనను ప్రభుత్వం 1962లో దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరించింది.
మరణం
సెప్టెంబర్ 1962లో డాక్టర్ ప్రసాద్ భార్య రాజవంశీ దేవి మరణించారు. ఈ సంఘటన రాజేంద్ర ప్రసాద్‌ ఆరోగ్యం క్షీణించడానికి దారితీసింది. డాక్టర్ ప్రసాద్ ప్రజా జీవితం నుంచి విరమించుకున్నారు. పదవీ విరమణ చేసి మే 14, 1962న పాట్నాకు తిరిగి వచ్చారు.. తన జీవితంలోని చివరి కొన్ని నెలలు పదవీ విరమణలో పాట్నాలోని సదఖత్ ఆశ్రమంలో గడిపారు. దాదాపు ఆరు నెలల పాటు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 28, 1963న రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Latest news