శ్రీకృష్ణ జననం అంటే లోకరక్షకుడి జననం. కానీ అందరూ తమ తమ సొంత పిల్లవాడు పుట్టిన విధంగా భావించి.. తన్మయత్వంతో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించుకుంటారు. దేశంలో పలు ప్రసిద్ధ క్షేత్రాలతోపాటు దాదాపు అన్ని నగరాలు, గ్రామాలలో ఆనందంగా జరుపుకొనే పండుగ. కేవలం పెద్దలే కాకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సంతోషంతో నిర్వహించుకునే పండుగల్లో ఇది ప్రధానమైనది.
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. శైవ, వైష్ణవ సంప్రదాయం పాటించేవారు ఇళ్లలో కూడా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి పాటలు పాడుతారు. ముంగిళ్లలో బాలకృష్ణుని పాదముద్రలను తీర్చిదిద్దుతారు. ఆ పాదముద్రలనే ఆనవాలు చేసుకుని బాలకృష్ణుడు తమ నట్టింట నడయాడుతాడని కొందరు భక్తులు నమ్ముతారు. ఇంట్లోని పూజమందిరంలో కృష్ణుని ప్రతిమను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు.
ఏయే నైవేద్యాలు?
కృష్ణయ్య జననం అంటే అందరికీ సంతోషమే కదా..పాలతో చేసిన తియ్యని పదార్థాలను ఎక్కువగా ఈ పండుగనాడు చేస్తారు. దీనిలో బాసంతి ప్రసిద్ధమైనది. ఇక తప్పనిసరిగా చేసేవాటిలో పాలు, అటుకులతో తయారుచేసిన మధుర పదార్థాలను, వెన్న మీగడలను కృష్ణునికి నైవేద్యంగా సమర్పించి, అందరూ భక్తితో ప్రసాదాన్ని తీసుకుంటారు.
ఏలాంటి పూజ చేయాలి?
శైవ, వైష్ణవ సంప్రదాయాలను పాటించే వారు వారివారి ఆచారాల ప్రకారం ఆరాధనలు చేస్తారు. ఎక్కువగా శ్రీకృష్ణుని విగ్రహాలకు అభిషేకం నిర్వహించి, అనంతరం చక్కటి వస్ర్తాలను అలంకరించి, తులసీమాల, దవనంతో చేసిన పూలమాలలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అష్టోత్తర పూజ, హారతి, మంగళారతులు, చిన్నపిల్లలతో కృష్ణవేషధారణ చేసి వారికి పూలమాల వేసి పిల్లనగోవి ఇచ్చి వారిలో భగవానుడుని చూడటంలాంటి పలు కార్యక్రమాలు చేస్తారు.
ఇక ఉట్ల పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత శ్రీకృష్ణ లీలలను పఠించడం లేదా వినడం చేయాలని ధర్మశాస్ర్తాలు పేర్కొన్నాయి. కృష్ణాష్మి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే చతుర్విధ పురుషార్థాలూ ప్రాప్తిస్తాయని స్కాందపురాణం లో ఉంది.
భాగవతంలోని దశమ స్కంద పారాయణ, భగవద్గీత పారాయణ, విష్ణుసహస్రనామ పారాయణ, కృష్ణాష్టకం పారాయణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.
అర్ధరాత్రి పూజ
కొన్ని సంప్రదాయాలను అనుసరించి శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు కాబట్టి ఆయనకు రాత్రి పూజచేయడం కూడా పలు ప్రాంతాల్లో కన్పిస్తుంది. రాత్రి ఆయనకు ఊయల సేవ, కాయచూర్ణం పెట్టి ప్రత్యేక ఆరాధనలు, పూజలు చేస్తారు.
– కేశవ