తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ రేపు పదో ఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ తెలంగాణ దశాబ్ది వేడుకల పేరుతో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జూన్ 2న నిర్వహించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.
హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాధిపతులు, వారి ఉద్యోగులు ప్రారంభ వేడుకలకు హాజరు కానుండడంతో.. అందుకు తగ్గట్లుగా సీట్లను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు అదనపు డీజీ స్వాతి లక్రా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, సమాచార ప్రజా సంబంధాల ప్రత్యేక కమిషనర్ కె.అశోక్‌రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ దానకిశోర్, ప్రోటోకాల్ విభాగం అదనపు కార్యదర్శి అరవిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.