భార్యాభర్తల జీవితం పెళ్లి తర్వాత చాలా మారిపోతుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే బంధంతో ఒకటైన భార్య-భర్త ఇద్దరూ కలిసి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలి. భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే నమ్మకం,నిజాయితీ చాలా అవసరం. అయితే కొన్ని విషయాలు చెప్పేవి ఉంటాయి కొన్ని బయటకి చెప్పనివి ఉంటాయి. అలా చెప్పకూడని విషయాలు బయటపడితే గొడవలు అపార్ధాలు తప్పవు. ఇక మగవారు తన భార్య గురించి బయట కొన్ని విషయాలు చెప్పకూడదు. అలా చెప్తే కుటుంబంలో గొడవలు మొదలవడానికి కారణం అవుతాయి. మరి ఎలా చెప్పకూడని విషయాలు ఏంటనేది మనం తెలుసుకుందాం..
లోపాలు బయట పెట్టకూడదు : భార్య భర్త ఇద్దరూ వారి పార్టనర్స్ గురించి తెలిసిన లోపాలను బయటకు చెప్పకూడదు. ముఖ్యంగా మగవారు తమ భార్యలో ఉండే చిన్న చిన్న లోపాలను వారి స్నేహితుల దగ్గర అలవాటుగా చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆమె అవమానంగా భావిస్తుంది ఆమె లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నించడం మంచిదే కానీ వాటిని నలుగురిలో ప్రస్తావించడం వల్ల మీ పట్ల ఆమెకి ఉన్న గౌరవం తగ్గుతుంది.
మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలు: భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాలు చాలా వ్యక్తిగతమైనవి ఇంట్లో జరిగే వాటిని బయట నలుగురిలో పెట్టకూడదు. మీ ఇద్దరి ఆదాయం ఖర్చుల గురించి మీరు మాట్లాడుకోవాలి. మీ భార్య ఆర్థిక నిర్ణయాల గురించి ఆమె చెప్పిన మాటలు గురించి ఇతరుల ముందు చర్చించకండి. ఇలాంటి విషయాలు బయట పెట్టడం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇతరులతో పోల్చడం : ఇంటికి ఎవరైనా నలుగురు వస్తే వారితో ఇంట్లో ఉన్న భార్యను పోల్చడం చాలా తప్పు . మీ భార్యను మీ మాజీ స్నేహితురాలితోనో, ప్రేమికురాలితోనో పోల్చడం ఇంకా తప్పు. ఇలాంటి పోలికలు భార్య మనస్సును తీవ్రంగా గాయపరుస్తాయి. ప్రతి మనిషి ప్రత్యేకమైన వాళ్ళుగా గుర్తించాలి, మీ భార్యలో ఉన్న మంచి లక్షణాలను అభినందించడం ద్వారా ఆమెను సంతోషపెట్టండి.
బెడ్ రూమ్ విషయాలు, రహస్యాలు : మీ భార్య బలహీనతలు ఆమె మీకు మాత్రమే చెప్పిన రహస్యాలు ఇతరులకు ఎప్పుడూ చెప్పకూడదు. ఆమె మీపై పెట్టుకున్న నమ్మకంతో మీతో పర్సనల్ విషయాలను పంచుకుంటుంది. ఆ నమ్మకాన్ని కాపాడడం మీ బాధ్యత. మీ ఇద్దరి మధ్య ఉన్న శారీరక సంబంధం గురించి, బెడ్రూంలో జరిగిన విషయాల గురించి బయట వారితో పంచుకోకండి. ఇది ఇద్దరి మధ్య ఉన్న పవిత్రతను దెబ్బతీస్తుంది.
ఈ విషయాలను గుర్తుంచుకొని మీ భార్య పట్ల గౌరవంగా వివరించడం వల్ల మీ వివాహ బంధం మరింత బలంగా మారుతుంది. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచి సంతోషకరమైన జీవితాన్ని అందిస్తుంది.