ఏ రిలేషన్షిప్ లో అయినా బౌండరీస్ లేకుండా అవతలి వ్యక్తి జీవితంలోకి వచ్చి చొరబడితే కచ్చితంగా గొడవలు జరుగుతాయి. ఆ బంధంలో బీటలు వచ్చి ఇరువురు దూరమైపోతారు.
ప్రేమికులైనా, భార్యాభర్తలయినా, స్నేహితులైనా.. బంధంలో బౌండరీలు పెట్టుకుంటే ఆ రిలేషన్షిప్ కి లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఒక బంధంలో బౌండరీలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
సేఫ్టీ:
బంధంలో బౌండరీలు సెట్ చేసుకోవడం వల్ల సేఫ్టీ గా ఉండగలుగుతారు. మీరు ఒక్కరే కాదు, అవతలి పర్సన్ కూడా మీ వల్ల సేఫ్ గా ఉంటారు. బంధానికి బౌండరీ పెట్టడం అంటే అవతలి వాళ్లను దూరంగా నెట్టేయడం కాదు. వాళ్లకు స్పేస్ ఇస్తున్నామని తెలుసుకోండి.
బలపడే బంధం :
ఒకరికొకరు పరిమితులు విధించుకోవడం వల్ల.. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేకాదు పరిమితులు పెట్టుకోవడం వల్ల రిలేషన్ లో ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరుగుతుంది. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం కూడా పెరిగి ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి.
స్వేచ్ఛ:
ఎవరికైనా అవసరమైన దానికంటే ఎక్కువగా చనువు ఇవ్వకూడదు. ఒకరి గురించి మొత్తం తెలిసిన తర్వాత వాళ్ల మీద ఒకలాంటి చులకన భావం ఉంటుంది. అంతేకాకుండా ఆ పర్సన్ కి స్వేచ్ఛ లేకుండా పోతుంది. బౌండరీస్ పెట్టుకున్నప్పుడు అవతలి వాళ్ళు ప్రశ్నించడానికి వీలు ఉండదు. తద్వారా స్వేచ్ఛ దొరికి వ్యక్తిగతంగా ఎదగ గలుగుతారు.
పరస్పరం ఎదుగుదల:
ప్రతి మనిషికి జీవితంలో ఎదగాలని ఉంటుంది. కొన్నిసార్లు బంధాల్లో ఇరుక్కుపోయి తాము అనుకున్నది సాధించకుండా పోతారు. అలా అవకుండా తమకంటూ కొంత స్పేస్ ఉంచుకుంటే.. జీవితంలో ఇద్దరూ ఎదుగుతారు. ఆ విధంగా ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు.