వేకువనే నిద్రలేవడం ఎలా? సరికొత్తగా, ఉత్సాహంగా

ఉదయాన్నే నిద్ర మేలుకోవడమనేది సాధారణంగా కొంచెం కష్టమైన పనే. విచిత్రమైన జీవనశైలిలో ఇది ఇబ్బందిగానే తోస్తుంది ఎవరికైనా.  కానీ, వేకువనే మేల్కోవడం చాలా చాలా మంచిది. ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మీ జీవనశైలి సరికొత్తగా, ఉత్సాహంగా మారిపోతుంది.

తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల మీకు లభించే ఉత్సాహం ఇతరత్రా సాధ్యం కాదు. కనీసం రెండు గంటల సమయం మీకు ఎక్కువ దొరుకుతుంది. దీంతో మీ పనులు వాయిదా వేయాల్సిన అవసరం రాదు. ఈ రెండు గంటల్లో మీరు చేసే పనులు మీ ఏకాగ్రత వల్ల త్వరితగతిన పూర్తవుతాయి. ఏకాగ్రత మరింత పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. నేనేనా..? అని అనుకునేంత సానుకూలదృక్పథం అలవడుతుంది. కోపం, విసుగు, ఒత్తిడి దూరమవుతాయి. అయితే ప్రారంభంలో ఇబ్బందిగా ఉండే ఈ నిద్రలేవడాన్ని అలవాటు చేసుకోవాలనువాళ్ల కోసం కొన్ని చిట్కాలు ఇవి. పాటించండి. తప్పకుండా మీకు ఉదయాన్నే నిద్రలేవడం అలవాటవుతుంది. ఉదయించే సూర్యున్ని వీక్షించడమనే ఆనందాన్ని కూడా హద్దులేకుండా పొందొచ్చు.

సడెన్‌గా మార్చకండి : ఇప్పుడు మీరు ఏ 6.30 కో, ఏడింటికో లేస్తున్నారనుకోండి. వెంటనే దాన్ని 4.30కి మార్చకండి. మెల్లమెల్లగా అలవాటు చేయాలి. ఓ అరగంటో, పావుగంటో వెనక్కి జరపండి. ఇలా కొన్ని రోజులు చేసాక, మీకు ఇబ్బందిగా అనిపించడం ఆగిపోతుంది. అప్పుడు మరో అరగంట వెనక్కి జరగండి. మళ్లీ కొన్ని రోజలు అలా… ఎక్కడికయితే రావాలనుకున్నారో ( 4.30 లేదా 5.00) వచ్చాక, ఇక దాన్ని కొనసాగించండి. ఏదైనా కొత్త విషయం అలవాటు కావాలంటే కొంత సమయం అవసరం.

  • తొందరగా నిద్రపోండి : ఆలస్యంగా పడుకోవడం మీకు అలవాటుగా ఉండొచ్చు. టీవీ   చూసుకుంటూనో, మొబైల్‌ సోషల్‌ మీడియాలో మునిగిపోయో లేట్‌గా పడుకుంటారు. ఇలా ఉన్నప్పుడు మీరు ఉదయాన్నే నిద్రలేచినా, ఎక్కువరోజులు కొనసాగించలేరు. అందుకని రోజటికంటే ముందుగానే మంచమెక్కేయండి. నిద్ర వచ్చినా, రాకపోయినా పడుకోండి. ఒకరోజు కాకపోయినా ఒకరోజు మీరు అలసిపోయిఉంటారు. ఆరోజు మీకు పడుకోగానే నిద్ర ముంచుకొస్తుంది. అంతే… అది ఆరోజు నుండి మీకు అలవాటయిపోతుంది. దీనివల్ల నిద్రలేమి బారిన పడకుండా ఉంటారు. ఆరోగ్యానికి నిద్ర కూడా చాలా అవసరం.

  • అలారంను దూరంగా పెట్టుకోండి : బెడ్‌ పక్కనే అలారం ఉండటం వల్ల మీరు దాని పీక నొక్కేసి మళ్లీ పడుకుండిపోయే అవకాశాలే ఎక్కువ. అందుకని దాన్ని దూరంగా పెట్టండి. ఆపాలంటే మీరు పక్కమీంచి లేచితీరాలి. ఒకసారి లేచామంటే ఇక లేచినట్టే. ఎందుకంటే అప్పటికి మీరు చేయవలసినవి గుర్తుకొచ్చేస్తాయి.

 

  • పడకగదిలోనుండి తొందరగా బయటపడండి : అలారంను కట్టేయగానే మళ్లీ బెడ్‌పై కూర్చుని.. పడుకుందామా అనే అలోచన వచ్చే అవకాశముంటుంది. అందుకని వెంటనే రూంలోనుండి బయటకు రావాలి. కనీసం టాయిలెట్‌కయినా వెళ్లాలి. పని పూర్తిచేసుకుని చేతులు కడుక్కుంటూ అద్దంలో మీ నిద్రమొహాన్ని చూసుకోగానే నిద్ర తేలిపోతుంది. ఇక నిద్ర రమ్మన్నా రాదు.

 

 

  • వేకువనే లేవడాన్ని బహుమతిగా భావించండి :  ఏ పనినైనా ఇష్టపడి చేయాలి. కష్టపడి కాదు. ఉదయాన్నే లేవడం ఒక ఆహ్లాదంగా మార్చండి. మీ మనసుకు నచ్చిన పనిని ఎంచుకుని మొదలుపెట్టండి. సుప్రభాతం వినడం కావచ్చు. ధ్యానం, యోగా చేయడం, జాగింగ్‌కు వెళ్లడం, పుస్తకాలు చదవడం లాంటివి ఉదయాన్నే చేయాల్సిన పనులుగా పెట్టుకోండి.

 

  • అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి : లేవడం మొబైల్‌ పట్టుకుని ఫేస్‌బుక్‌ చూడ్డంలాంటి దిక్కుమాలిన పనులకయితే అసలు లేవకపోవడమే బెటర్‌. ఆదనంగా దొరుకుతున్న సమయాన్ని వృధా చేయకండి. ఉదయాన్నే లేవాలని నిర్ణయించుకున్నప్పుడే లేచి ఏం చేయాలో కూడా ఓ టైంటేబుల్‌ తయారుచేసుకోవాలి. ఒకదాని వెంట మరొకటి చేసుకుంటూ వెళ్లాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి.

  • సూర్యోదయాన్ని ఆస్వాదించండి : నల్లని ఆకాశం మెల్లమెల్లగా తెల్లబడటాన్ని చూడటం ఎంతో హృద్యంగా ఉంటుంది. పక్షుల కిలకిలారావాలు వింటూ, భానుడు మెల్లగా తొంగిచూడటాన్ని వీక్షించడం మనసుకు ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. దాన్ని మిస్‌ కాకండి.

 

 

ఈ టిప్స్‌ పాటిస్తే, తెల్లవారుజామునే లేవడం ఇక ఏమాత్రం కష్టమనిపించదు. ఎంతో ఉత్సాహవంతమైన జీవనశైలి మీ సొంతమవుతుంది. చేస్తున్న పనులలో నాణ్యత బాగా అభివృద్ధి చెందుతుంది. సమాజంలో మీ విలువ, గౌరవాలు కూడా ఆటోమాటిక్‌గా పెరుగుతాయి.

–  చంద్రకిరణ్‌