రామ మందిర నిర్మాణ ఉద్యమంలో మరో కీలక మలుపు లాల్ కృష్ణ అద్వానీ రామజన్మభూమి నినాదాన్ని ఎత్తుకోవడం. మందిర్ వాహీ బనాయేంగే అంటూ 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన పిలుపు నేడు నిజమైంది. రామజన్మభూమి ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ మద్దతు లభించడంతో ఆ ఉద్యమం స్వరూప స్వభావాలే మారిపోయాయి. దేశ రాజకీయాలు సైతం కొత్త మలుపు తీసుకున్నాయి. హిందూ – ముస్లింల మధ్య చీలిక వచ్చింది. అయితే రామజన్మభూమి ఉద్యమాన్ని బీజేపీ ఎదుగుదలకు అనువుగా మలచడంలో అగ్రనేత లాల్కృష్ణ అద్వానీదే కీలకపాత్ర. ఆయన రామన్మభూమిని రాజకీయ అంశంగా మార్చారు. ఇక, అప్పటి నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనే అంశం భారతదేశంలోని ప్రతి హిందువు అజెండాగా మారిపోయింది. హిందువుల భావోద్వేగాల సమస్యగా దానిని మలచడంలో అద్వానీ పాత్ర ఇంతని చెప్పలేం.
1986లో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నపుడు పార్టీ సిద్ధాంతాలను అతివాద హిందుత్వం వైపు మళ్లించారు. 1989లో రామ మందిర అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. 1990లో ఈయన చేపట్టిన రామ్ రథయాత్ర.. మొత్తం దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చేసింది. బీజేపీ విజయ పరంపరకు ఈ యాత్ర బాటలు వేయడమే కాక, హిందుత్వ వాదుల్లో అద్వానీని తిరుగులేని నాయకుడిగా చేసింది. నిజానికి ఆ సమయంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడమే కాక, అద్వానీ ప్రధాని కూడా అయ్యేవారే. అయితే, ఆ సమయంలో అప్పటి ప్రధాని, కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ చెన్నైలో లంక ఉగ్రవాదుల దాడితో హత్యకు గురయ్యారు. ఈ సానుభూతితో నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది. నిజానికి ఈ హత్యకు ముందు దశలో జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన స్థానాలు అరకొరే.. అంటే రాజీవ్ హత్యకు గురికాకుండా ఉంటే నాటి ఎన్ని కల్లో బీజేపీ గెలిచి, అద్వానీ వంద శాతం ప్రధానమంత్రి అయ్యే వారని రాజకీయ పరిశీల కులు ఇప్పటికీ అంటుంటారు.
ముఖ్యంగా బీజేపీ తరపున కార్యక్రమాలు చేపడుతూనే, వాటన్నిటిలోనూ సంఘ్ పరివార్ను భాగస్వామ్యం చేయడం ద్వారా రామజన్మభూమి ఉద్యమాన్ని అద్వానీ మరో ఎత్తుకు తీసుకెళ్లారు.