మోడీ సర్కారుకి పోలీసులపై దయలేదా?

-

కరోనాపై యావత్ దేశం పోరాడుతున్న సమయంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ తాజాగా ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం… ఇకపై ఎవరైనా కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులు చేసినట్లయితే… వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఈ మేరకు 1987 నాటి అంటురోగాల చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం ముద్ర వేసింది.

వివరాళ్లోకి వెళ్తే… వైద్యులపై దాడికి పాల్పడిన వారిపై కేసు తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు విధిస్తామని, రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు. దాడి సమయంలో ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఆస్తి నష్టం, వైద్య సిబ్బంది వాహనాల ద్వంసం వంటి నష్టాలు సంభవిస్తే మార్కెట్ విలువ ప్రకారం లెక్కించి అంతకు రెట్టింపు మొత్తాన్ని నిందితుల నుంచి వసూలు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇలాంటి సమయంలో వైద్యులు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది దేశానికి ఎనలేని సేవలందిస్తున్నారని జావడేకర్ కొనియాడారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ ఆర్డినెన్సులో పోలీసులను ఎందుకు చేర్చలేదు అనే ప్రశ్నలు విశ్లేషకులనుంచి ఎదురవుతున్నాయి!

నిజమే కదా… వైద్యులు, ఆశావర్కర్లు, పారిశుధ్య సిబ్బంది (ఏపీలాంటి చోట గ్రామ / వార్డు వాలంటీర్లు) ఎంతో శ్రమించి పనిచేస్తున్న సంగతిపై ఎవరికీ భిన్నాభిప్రాయలు లేవు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ… ఇదే సమయంలో వైద్యుల అనంతరం ఆ స్థాయిలో పనిచేస్తున్న పోలీసుల సంగతి ఏమిటి? ఈ వరుసలో ఏ ఒక్కరూ ఎక్కువ కాదు.. ఏ ఒక్కరూ తక్కువ కాదు. వారి వారి పరిధి మేరకు వైద్యులు, ఆశావర్కర్లు, పారిశుధ్య కర్మికులు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శ్రమిస్తున్నారు… ఇదే సమయంలో పోలీసు వ్యవస్థ ఏ రేంజ్ లో పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! మరి ఎందుకో తెలియదు కానీ… పోలీసులపై దాడులు చేస్తే మాతం మోడీ సర్కార్ అంత సీరియస్ గా స్పందిస్తున్నట్లు లేదు! ఈ క్రమంలో పోలీసులు కూడా బ్లాక్ డే అనో లాఠీ డౌన్ అనో ప్రకటిస్తే… అప్పుడైనా వారి విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా… కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ సందర్భంగా ఎవరైనా పోలీసులపై దాడులు చేస్తే, అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. యూపీలో లాక్ డౌన్ సందర్భంగా ఎవరైనా పౌరులు పోలీసులపై దాడులకు పాల్పడితే అలాంటి వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేయాలని యూపీ సర్కారు పోలీసులకు జారీ చేసిన ఆదేశాల్లో కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news