కరోనా విషయంలో ప్రపంచం మొత్తం కూడా కదలబారి పోతోంది. కేవలం మూడు మాసాల వ్యవధిలో ప్రపంచం మొత్తాన్ని అతలా కుతలం చేస్తున్న ఈ మహమ్మారి విషయంలో అసలు జన్మస్థానమైన చైనా చెబుతున్నదానికి.. ఇప్పుడు జరుగుతున్న పరిణా మాలకు సంబంధం ఎక్కడా కనిపించడం లేదు. చైనాలో గత ఏడాది నవంబరులోనే వెలుగు చూసిన ఈ వైరస్ కారణంగా.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 3020 మంది మాత్రమే మరణించారని తెలుస్తోంది. అది కూడా దేశవ్యాప్తంగా కాకుండా కేవలం వుహాన్ అనే రాష్ట్రంలోనే ఈ మరణాలు సంభవించాయని ప్రభుత్వం అంటోంది.
కానీ, గడిచిన రెండు నెలల పరిస్థితి అదేసమయంలో అమెరికా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాల పరిస్థితిని అంచనా వేస్తే.. చైనా చెబుతున్న లెక్కలు, ప్రపంచాన్ని ముందుగానే హెచ్చరించడంలో చేసిన విస్మృతి చాలా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఏదైనా వ్యూహంతో ఇలా ప్రపంచాన్ని మోసం చేసిందా? లేక ప్రపంచ పటంలో చైనా తన పేరును ఎక్కడ పాడు చేసుకోవాల్సి వస్తుందోన ని భయంతో ఇలా కరోనాను దాచిందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం.. అమెరికాలో ఫిబ్రవరి రెండో వారంలో ఈ కరోనా ఎఫెక్ట్‌బయటకు వచ్చింది.
ఇప్పటికి అక్కడ రెండువేల మందిపైగా మరణించారు. దాదాపు ఇదే సమయంలో స్పెయిన్‌లోనూ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటికి దాదాపు 8 వేల మంది మృతి చెందారు. ఇక, ఇటలీ అయితే, పదివేలను మించిన మరణాలతో శ్మశానాన్నే తలపిస్తుండడం గమనార్హం. అలాంటిది చైనాలో అందునా.. వైరస్ పుట్టిన దేశంలో కేవలం మూడు వేల మంది మాత్రమే మరణించారని చైనా చెప్పడం, చాలా నెలల పాటు.. అసలు ఇది అంటు వ్యాధి కానేకాదని, జంతువుల నుంచి మాత్రమే సోకుతుందని, మనుషుల నుంచి మనుషులకు సోకదని చెప్పడం, ఆ తర్వాత మొత్తంగా ఇది విస్తరించడం వంటి పరిణామాలు చూస్తే.. మొత్తానికి ప్రపంచం కళ్లకి చైనా గంతలు కట్టిందనేదివాస్తవం.
మరోపక్క, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై అనుమానం వ్యక్తం చేస్తే.. ఓ వర్గం మీడియా ఆయనను తప్పుపడుతూ.. చైనాను వెనుకేసుకు రావడం వెనుక కూడా కుట్ర ఉందనే ప్రచారం ఉంది. మొత్తానికి కరోనా విషయంలో చైనా చేసింది. చేస్తోంది కూడా దారుణమనే అంటున్నారు పరిశీలకులు.