అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి మేరకు భారత్ సరఫరా చేసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు అమెరికా చేరుకున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్టుకు సదరు మెడిసిన్ ఉన్న విమానం చేరుకుందని అమెరికాలో భారత్ రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధు వెల్లడించారు. ఈ మేరకు సంధు ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీ సదరు ట్యాబ్లెట్ల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మొత్తం 35.82 లక్షల ట్యాబ్లెట్లను అమెరికాకు పంపించనున్నారు. అందులో భాగంగానే తొలి విడత కన్సైన్మెంట్ ప్రస్తుతం అమెరికాకు చేరుకుంది.
కాగా అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను పంపినందుకు గాను ప్రధాని మోదీకి అమెరికా ఎంతగానో రుణ పడి ఉంటుందని అక్కడి ప్రముఖులు తెలిపారు. ఇక అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్‌ను కరోనా చికిత్స కోసం ఉపయోగించవచ్చని గతంలో తెలియజేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఆ మందులు కావాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే మెడిసిన్‌ను భారత్ ఇతర దేశాలకు కూడా సరఫరా చేయనుంది.
కాగా ప్రపంచం మొత్తం మీద తయారయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లలో భారత్‌లోనే 70 శాతం వరకు ట్యాబ్లెట్లు తయారవుతుండడం విశేషం. అయితే సదరు ట్యాబ్లెట్లతోపాటు వాటి తయారీకి అవసరం అయ్యే ముడి పదార్థాలను కూడా భారత్ అమెరికాకు పంపుతోంది. ఇక ఆ ట్యాబ్లెట్లను అక్కడ కరోనా రోగులకు మొదటి రోజు రెండు పూటలా 400 ఎంజీ డోసులో ఇస్తున్నారు. రెండో రోజు నుంచి రెండు పూటలా 200 ఎంజీ డోసులో 10 రోజుల వరకు ఈ మెడిసిన్‌ను రోగులకు ఇవ్వనున్నారు.