ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను కరోనా ఏ విధంగా భయపెడుతుందో అందరికీ తెలిసిందే. జనాలు రోడ్ల మీదకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక ఇప్పటికే భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది. దీంతో విదేశాల్లో చాలా మంది భారతీయులు చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే ఇటలీలో ఉన్న భారతీయులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతుండడం భారత్ దృష్టికి వచ్చింది. అయితే విమాన సర్వీసులను రద్దు చేసిన నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు నిజానికి పైలట్లు ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ ఆ మహిళా పైలట్ మాత్రం ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చింది. ఇటలీలో చిక్కుకున్న 265 మంది భారతీయులను ఆమె ఇండియాకు విమానంలో తీసుకువచ్చింది.
పైలట్ స్వాతి రావల్ ఎయిరిండియాలో కెప్టెన్. ఆమెకు 10 సంవత్సరాల కుమార్తె కూడా ఉంది. అయితే ఇటలీలో భారతీయులు చిక్కుకుపోవడంతో వారిని విమానంలో తీసుకువచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ స్వాతి రావల్ ధైర్యం చేసింది. ఎయిరిండియాకు చెందిన 777 బోయింగ్ విమానంలో 265 మంది భారతీయులను ఇండియాకు తీసుకువచ్చింది. దీంతో ఆమెను ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు.
పైలట్ స్వాతి రావల్ చూపిన ధైర్య సాహసాలకు సాక్షాత్తూ ప్రధాని మోడీయే ఆమెను అభినందించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్వాతి రావల్‌కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమె తెగువను ప్రశంసిస్తున్నారు.