నైట్ కర్ఫ్యూతో కరోనాను కట్టడి చేయొచ్చా..?

-

భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెల్సిందే. గడిచిన 24 గంటల్లో 1,26,789 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. ప్రస్తుతం 9,10,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ విధిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి.మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతాల్లో కర్ఫ్యూ విధించగా… ఢిల్లీ ప్రభుత్వం ఏప్రిల్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక పంజాబ్‌, గుజరాత్‌ ప్రభుత్వాలు కూడా ఇదే బాటలో నడవగా… తాజాగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా వారాంతపు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ తెలిపారు.

అయితే కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వారాంతపు లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూలు కరోనా కట్టడిలో ఎంత ప్రభావం చూపుతాయనే ప్రశ్న తలెత్తుతుంది. అసలు వీటి వల్ల కరోనాను కట్టడి చేయొచ్చా అని సామాన్యుల్లో సందేహం కలుగుతుంది. కర్ఫ్యూ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకోలేమని పలువురు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.

అయితే ప్రజలు పగటి పూట పనులకు వెళ్తారని… పనుల నుంచి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులు భోజనానికి కానీ పార్టీలకు కానీ సినిమా లేదా ఇతర వినోదాల కోసం ఇంట్లోంచి బయటకు వెళ్తారని అక్కడ వైరస్ ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా లాక్‌డౌన్‌ విధించడం ద్వారానే కరోనాను కట్టడి చేయొచ్చని అయితే దీని వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. కావున పగటి సమయంలో మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలని…అలానే రాత్రి సమయాల్లో అనవసరంగా బయట తిరగకుండా ఉండేందుకు ప్రభుత్వాలు వారాంతపు లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని… పూర్తి లాక్ డౌన్ తో పోలిస్తే ఇవే మేలని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news