దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా.. శుక్రవారంతో అక్కడ ఆ కేసుల సంఖ్య ఏకంగా 1 లక్ష దాటింది. దీంతో అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,141కి చేరుకుంది. ఈ క్రమంలో 1 లక్ష కరోనా కేసులు దాటిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర ఆవిర్భవించింది. శుక్రవారం ఒక్క రోజే అక్కడ 3493 కేసులు కొత్తగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల సమయంలో అక్కడ 127 మంది కరోనాతో చనిపోయారు. దీంతో అక్కడ మొత్తం మరణాల సంఖ్య 3717కు చేరుకుంది.
ఇక శుక్రవారం 1718 రికవరీ అయి డిశ్చార్జి కాగా 47,796 మంది చికిత్స పొందుతున్నారు. కాగా మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు కరోనా లక్షణాలేవీ కావు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇక మహారాష్ట్ర కేబినెట్‌లో కరోనా సోకిన మంత్రుల్లో ఆయన మూడో వ్యక్తి. అంతకు ముందు ఎన్‌సీపీ నేత జితేంద్ర అవ్‌హాద్, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో వారు కూడా ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
కాగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తొపె మాట్లాడుతూ.. తాము ప్రతి ఒక్కరికీ ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక మహారాష్ట్ర తరువాతి స్థానంలో తమిళనాడు ఉంది. అక్కడ 38,716 కరోనా కేసులు నమోదయ్యాయి. తరువాత ఢిల్లీ (34,687), గుజరాత్ (22,067)లు వరుస స్థానాల్లో నిలిచాయి.