కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో మార్చి 31వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ, సినిమా హాల్స్‌ను మూసివేశారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. ఇకపై రైళ్లలో ఏసీ బోగీలలో ప్రయాణికులకు దుప్పట్లను ఇవ్వబోమని అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు తమ దుప్పట్లు, దిండ్లను తామే తెచ్చుకోవాలని సూచించారు.
రైళ్లలో ఏసీ బోగీలలో ప్రయాణించే వారు తమ బ్లాంకెట్లను తామే తెచ్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే, మధ్య, పశ్చిమ రైల్వే సూచించింది. అయితే కోచ్‌లలో కొన్ని దుప్పట్లను ఎమర్జెన్సీ కోసం ఉంచుతామని, కానీ ప్రయాణికులు మాత్రం వారి బ్లాంకెట్లు వారే తెచ్చుకోవాలని సూచించింది. సాధారణంగా ఏసీ కోచ్‌లలో ఉపయోగించే దుప్పట్లు, బ్లాంకెట్లు, దిండ్లను రోజూ ఉతకరు. రైలు చివరి గమ్యస్థానంలో ఆగినప్పుడే మళ్లీ ప్రయాణం అయ్యే లోపు కోచ్‌లను శుభ్రం చేస్తారు. ఇక దుప్పట్లు, దిండ్లను కూడా అప్పుడే మారుస్తారు. ఈ క్రమంలోనే కరోనా నేపథ్యంలో వాటిని కోచ్‌ల నుంచి పూర్తిగా తీసేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
కాగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లను ఇప్పటికే శానిటైజ్ చేస్తున్నామని మరోవైపు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.